ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాజధాని అమరావతి కొనసాగింపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అటు ప్రభుత్వం కూడా అమరావతి కొనసాగింపు పై స్పష్టమైన ప్రకటన చెయ్యలేదు దీనితో అమరావతి లో కట్టిన భవనాలు మరియు రోడ్లపై సందేహాలు ఉన్నాయి. 

 

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఎం జగన్ అమరావతిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిలిచిపోయిన నిర్మాణాలు అన్నీ కొనసాగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివసించే గృహ నిర్మాణాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

హంగులు, ఆర్భాటాలు వద్దు: సీఎం 

 

రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అంచనా వ్యయాల తగ్గింపు అంశాలపై ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాజధాని జనాభా 1.5 లక్షలు మాత్రమే ఉన్నందున అంత భారీ రహదారులు ఇప్పుడే అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారు. రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైనంత మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఖర్చు తగ్గించిన తరువాత కూడా రాజధాని నిర్మాణానికి రూ 15,000 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున, వచ్చే మూడేళ్లలో ఈ మొత్తం నిధులు సమకూర్చాలని కోరారు. 

 

హ్యాపీనెస్ట్‌ ఫ్లాట్ ఓనర్స్ కు గుడ్ న్యూస్ 

 

గత ప్రభుత్వ హయాంలో హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్ క్రింద 1200 ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించేందుకు సీఆర్‌డీఏ తలపెట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధానిలో పనులన్నీ నిలిపివేయడంతో, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టూ ఆగిపోయింది. ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నవారు ఈ ప్రాజెక్టుపైనా సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇది హ్యాపీనెస్ట్‌ ఫ్లాట్ ఓనర్స్ కు గుడ్ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: