కడప జిల్లా పర్యటనలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విధానాలను చంద్రబాబునాయుడు అభినందించారా ? సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పిన విషయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రతిరోజు, ప్రతి నిముషం వైసిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రశంసించక తప్పటం లేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఫిరాయింపులు, పార్టీ కోసం, పార్టీనే నమ్ముకున్న వాళ్ళకు పదవులు ఇవ్వటంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు కూడా మెచ్చుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కోవటం చాలా పెద్ద తప్పని చెప్పిన నేతల అభిప్రాయాలతో చంద్రబాబు కూడా ఏకీభవించారు.

 

అంటే పార్టీ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో ఫిరాయింపుల ప్రభావం కూడా ఒకటని చంద్రబాబు మొత్తానికి ఒప్పుకున్నారు. ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు అనేకమంది అధికారం కోసం వస్తారని అలాంటి వాళ్ళు అధికారం కోల్పోగానే పార్టీని వదిలి వెళ్ళిపోతారన్న విషయం అర్ధమైందని అంగీకరించారు.

 

అందుకనే తొందరలో నిర్వహించబోయే పార్టీ సంస్ధాగత ఎన్నికల్లో నూరుశాతం పార్టీకి విధేయులుగా ఉండే వారిని మాత్రమే ఎన్నుకోవాలని శ్రేణులకు పిలుపిచ్చారు. అలాగే పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల పంపకంలో కూడా తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో పదవుల పేరు చెప్పి నాలుగేళ్ళు ఊరించారు. చివరి ఏడాది మాత్రమే పార్టీ నేతలకు పదవులను పంచారు.

 

నిజానికి మొదటి నాలుగేళ్ళ పాటు అందరినీ ఎండగట్టి చివరలో మాత్రమే పదవులు ఇవ్వటాన్ని పార్టీలోనే చాలామంది వ్యతిరేకించారు. దాంతో పదవులు రాని వాళ్ళు చివరకు పదవులు వచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు, పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అయిపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తనను, పార్టీని నమ్ముకున్న వాళ్ళకు జగన్ పదవులు ఇస్తుండటాన్ని పరోక్షంగ అభినందించారు. పదవుల పంపిణీలో తాను కూడా జగన్ లాగే చేసుంటే కొంతమందైనా పార్టీ విజయంకోసం పనిచేసుండే వారే అని చంద్రబాబు అనటంలో అర్ధమేంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: