భారతదేశాన్న్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. మన భారత ప్రజలు సాంప్రదాయాలకు, సంస్కృతులకు విలువనిస్తూ, ఏ దేశీయుడు వచ్చినా అమ్మలా ఆదరిస్తారు. ఉన్నదాంట్లో కొంత పంచుతారు. కాని ఉగ్రవాదులకు అదేమి తెలియదు. కర్కోటకులు. జాలిదయ లేకుండా జన్మించిన రాక్షస జాతి మనుషులు. తల్లి పాలనే అంగట్లో అమ్మె నీచపు ఆలోచన కలిగిన మర మనుషులు. కాని భరత మాతకు ఏం తెలుసు. ఆకలని వచ్చిన వారిని అక్కున చేర్చుకొని ఆశ్రయమిచ్చి వారి ఆకలి తీర్చడం తప్ప. ఇదే భరత మాత చేస్తున్న తప్పైతే ఈ దేశంలో అంతకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు తయారవుతారు.

 

 

మన భరత మాత పెదాలపై చిరునవ్వు నిత్యం చెదరక ఉండటం కోసమే సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయక ఎందరో సైనికులు పహరా కాస్తుంటారు. ఒక విధంగా దేశాన్ని రక్షించడం కోసం, జాతీయ జెండా రెపరెపల్లో ఉన్న మువ్వన్నెలు నిత్యం గౌరవంగా ఎగురుతుండటం కోసం వారి కుటుంబాలను మరచి నిర్వహించే ఆ ఉద్యోగ ధర్మం జాతి అంత మెచ్చుకునే కర్తవ్యం. మరి ఉగ్రచర్యల్లో ఏ నీతి ఉందని, అసలు దాని జాతి ఏదని పిరికిపందల్లా  అమాయకుల ప్రాణాలు తీయడం తప్ప వారు నేర్చుకున్నదేముంది.

 

 

ఈ భారతదేశంలో ఉన్న ఒక్కో భారతీయుడు రగులుతున్న జ్వాలలా ఉప్పొంగితే ఉగ్రవాదం ఆచూకి కూడ కనబడదు. శాంతిని నేర్పిన కపోతం కూడా మారణహోమంలో బలి అవుతుంటే మౌనంగా ఉన్న భరతమాత ఏం చేయలేక కాదు. ప్రాణం విలువ తెలుసు కాబట్టి, ప్రాణం పోయడమే తెలిసిన చేతులతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం తెలియదు...  

 

 

ఇక సర్వమత సమ్మెళనంతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ నేలను రక్తసిక్తం చేసిన ముంబై మారణహోమానికి 11ఏళ్లు పూర్తయ్యింది.. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.. ఈ దాడి ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల్ని తలచుకొని బాధపడుతున్న వారి కన్నీటి తడి ఇంకా ఆరిపోలేదు..

 

 

ఇకపోతే 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడి, ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. ఈ సమయంలో భారత దళాలకు లోపల దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి మూడు రోజులకు పైగా పట్టింది.

 

 

ఇక పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా, 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. ఈ సంఘటనతో ముంబై నగరం భయంతో వణికిపోయింది. అప్పుడు అయిన గాయం ఇప్పటికి మాయని మచ్చలా భారతీయుల గుండెల్లో ఏర్పడింది. ఇప్పటికి మాటేసిన ఈ ఉగ్రవాదం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం ఎక్కడో లోలోన కదలాడుతుంది. మంచికోసం మరణించే వాన్ని వీరుడు అంటారు. కాని ఇలా ఉగ్రవాదిగా చచ్చేవానికి ఏ పేరు పెడతారో ఇప్పటికి సమాజానికి అర్దం అవడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: