ఆర్టీసీ స‌మ్మె వ‌ల్ల జ‌రుగుతున్న విప‌రిణామాల్లో ఇది మ‌రొక‌టి.  ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక సిబ్బంది బస్సులను నడపడంతో పలు చోట్ల ఇప్పటికే ప్రమాదాలు జరిగాయి. అయితే హైద‌రాబాద్‌ బంజారాహిల్స్‌లో జరిగిన ప్రమాదం మాత్రం స్థానికులను కలిచివేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో హోండా యాక్టివా పై వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో..ఆమె అక్క‌డికక్క‌డే క‌న్నుమూసింది. సోహిణీ సక్సేనా అనే మహిళ తలపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లినా...ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. మహిళ పరిస్థితిని చూసిన స్థానికులు బస్సు అద్ధాలను ద్వంసం చేశారు.  సోహిణీ టాటా కన్సల్టెన్సీలో చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

ఇదిలాఉండ‌గా, ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించడంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవడంపై ఉత్కంఠ నెల‌కొంది. అంద‌రి దృష్టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప‌డ‌టంతో...ప్రగతి భవన్‌లో రవాణాశాఖా అధికారుల సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆర్టీసీ భవిష్యత్తుపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో తీసుకునే నిర్ణ‌యం ఆధారంగా నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ భేటీ కొనసాగనుంది. 29వ తేదీన కూడా మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్‌ భేటీలో ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.

 

ఇదిలాఉండ‌గా, తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోల వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే డిపోల్లోకి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: