మహారాష్ట్ర రాజకీయాల్లో లేటెస్టు ట్విస్టు చోటు చేసుకుంది. డిప్యుటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు ఒక్క రోజు ముందు అజిత్ డిప్యుటి సిఎంగా ఎందుకు రాజీనామా చేశారు ? ఇదే విషయమై పార్టీల నేతలందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

 

విశ్వాసపరీక్షను ఎదుర్కొంటామని, విజయం సాధిస్తామని ఉదయం సిఎంగా బాధ్యతల తీసుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే అదే సమయంలో ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్ తరపున కొందరు కీలక నేతలు అజిత్ తో మంతనాలు జరుపుతునే ఉన్నారు. అజిత్ పై రెండు రోజులుగా శరద్ పవార్ కుటుంబంతో పాటు ఎన్సీపి నేతలు సెంటిమెంటు అస్త్రాలను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.

 

ఇదే విషయమై ఈరోజు ఉదయం నుండి అజిత్ తో ఎన్సీపి నేతలు మాట్లాడుతునే ఉన్నారు. సుప్రింకోర్టు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో  బలపరీక్షకు సిద్దం కావాలని ఫడ్నవీస్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. బలపరీక్షలో నెగ్గటానికి ఒకవైపు బిజెపి, ఫడ్నవీస్ ఫెయిలయ్యారని నిరూపించేందుకు ఇంకోవైపు శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ మూడు పార్టీలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి.

 

రెండు శిబిరాలు వేటికవే విడివిడిగా క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయి. ఇటువంటి సమయంలోనే హఠాత్తుగ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. అలాగే సాయంత్రం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయటం ఖాయమనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ నిముషం ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. బలపరీక్షలో విజయం సాధించటం కష్టమని అర్ధమైనందు వల్లే ముందు అజిత్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే బిజెపి పరువు పోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే కర్నాటకలో ఇలాగే చేసి పరువు పోగొట్టుకుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: