రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం. మహారాష్ట్ర క‌ల‌క‌లంలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శివసేన చేయని ప్రయత్నమంటూ ఉండ‌గా...ఎవరూ ఊహించని విధంగా.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్ ఇవాళ అదే పదవికి రాజీనామా చేశారు. దీంతో...బలపరీక్ష కంటే ముందే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా తన పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఫడ్నవీస్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియా ముందుకు రానున్న నేప‌థ్యంలో...ఈ అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం  50-50 ఫార్ములాకు భారతీయ జనతా పార్టీ అంగీకరించకపోవడంతో.. శివసేన ఇతర పార్టీలతో జతకట్టేందుకు సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే శివసేన - కాంగ్రెస్‌ - ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ స‌మ‌యంలో ఫ‌డ్న‌వీస్ సీఎంగా, అజిత్ ప‌వార్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని అజిత్‌ పవార్‌పై ఎన్సీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల ద్వారా అజిత్‌ పవార్‌పై శరద్‌ పవార్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. పార్టీలోకి తీసుకునేందుకు వీలుగా అజిత్‌ను ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్‌ సస్పెండ్‌ చేయలేద‌ని తెలుస్తోంది.

 

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్ స్వాగ‌తించారు.  భారత రాజ్యాంగ దినోత్సవం నాడు మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు పవార్‌ నివాళులర్పించారు. మహారాష్ట్ర రాజకీయాల విషయంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను సుప్రీంకోర్టు పరిరక్షించినందుకు .. న్యాయస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ‌ల‌నిరూప‌ణ‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప‌వార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్వాగ‌తించారు. . భారత రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీం ఇచ్చిన తీర్పు మహారాష్ట్ర ప్రజలకు కానుక అని తెలిపారు. ఓపెన్‌ బ్యాలెట్‌ పద్ధతిన బలపరీక్ష నిర్వహించడం శుభపరిణామం అన్నారు. మహారాష్ట్రలో సత్యమే వర్ధిల్లుతుంది. జై హింద్‌, జై మహారాష్ట్ర అని సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: