మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతూ ఉన్నాయి. బలపరీక్షకు ముందే భారతీయ జనతా పార్టీ కూటమి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్.. ఇప్పటి దాకా కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదు. బాధ్యతలను స్వీకరించలేదు. 

 

 

   శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి తన బలాన్ని సంపూర్ణంగా నిరూపించుకున్న నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేశారని అంటున్నారు. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని అంటూ అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీకి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అధికారికంగా లేఖను సైతం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. ఈ లేఖ ఆధారంగా గవర్నర్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మహారాష్ట్రలో శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

 

 

     అజిత్ పవార్ రాజీనామా చేసిన కాస్సేపట్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విలేకరుల సమావేశం సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. అజిత్ పవార్ ఇచ్చిన లేఖ ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఏకంగా అజిత్ పవారే తప్పుకోవాల్సి రావడం వల్ల దేవేంద్ర ఫడ్నవీస్ సైతం వైదొలగడానికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బలం లేదని తెలిసే దేవేంద్ర ఫడ్నవీస్ బల పరీక్షకు ముందే రాజీనామా చేయొచ్చని అంటున్నారు. 

 

 

        బీజేపీకి ఉన్న బలం 105 ప్రస్తుతం ఆ పార్టీకి శాసన సభలో 105 మంది సభ్యులు బలం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం అవుతుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తనకు 54 మంది సభ్యుల బలం ఉందంటూ లేఖ ఇవ్వడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటైంది కూడా. 

 

 

      అజిత్ పవార్ రాజీనామా నేపథ్యంలో బీజేపీకి పూర్తిగా కథ అర్థం అయ్యిందని, మరి కాసేపట్లో ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విశ్వాస పరీక్షను ఎదుర్కొని సభలో భంగపడే బదులు ముందే రాజీనామా చేయడం మేలని ఫడ్నవీస్ అనుకుంటున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: