దేశంలో అత్యంత శక్తిమంతమైన పార్టీ  అని చెప్పుకుంటున్న బీజేపీకి ఇప్పటికి రెండు సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కర్నాటకలో గత ఏడాది ఇదే తీరున కుర్చీ ఎక్కిన యడ్యూరప్ప దారుణ పరాజయభారంతో వెనుతిరగాల్సివచ్చింది. ఇపుడు ఆ వంతు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్న‌వీస్ ది అయింది. ఈ రెండు ఎపిసోడ్ వెనక డైరెక్షన్ మాత్రం ఢిల్లీ నుంచే వచ్చిందని ప్రచారంలో ఉంది.

 

ఇక దేశంలో రెండవమారు బీజేపీ వరసగా అధికారంలోకి రావడంతో 2047 వరకూ బీజేపీ అధికారంలో ఉంటుందని అపుడే కమలనాధులు కలలు కన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వాలను సాఫీగా సాగనివ్వకుండా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతల హడావుడి అంతా ఇంతా కాదు ఏపీ విషయానికి వస్తే బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ని ఊపిరి తీసుకోనీయకుండా నాన రకాలుగా మాటలంటూ వచ్చారు.

 

ఏపీకి చేసిన సాయం ఏదీ లేకపోగా మేమే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ జబ్బలు చరచుకుంటోంది. ప్రత్యేక హోదా తుంగలోకి తొక్కారు. వరసగా ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, జగన్ లను దారుణంగా అవమానిస్తూ వచ్చారు. ఇక ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేయడంలో కాంగ్రెస్ కంటే బీజేపీ నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని కూడా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

 

అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇస్తే ఆయన మీద కేసులు ఉండవు. 70 వేల కోట్ల పై చిలుకు చేసిన స్కాములకు ఆధారాలు అసలు ఉండవు. అదే ఎవరైనా ఎదురుతిరిగితే మాత్రం సీబీఐ, ఈడీలు వెంటతరుముతాయి. కాంగ్రెస్ టైంలో లో కూడా ఇంత వేగంగా పావులు కదపలేదు. అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పుకునే వారు ఇలా చేయడం దారుణమే. ఓ వైపు గవర్నర్ల మీటింగ్ పెడుతూ మహారాష్ట్ర గవర్నర్ చేస్త ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయిస్తారు.

 

మరో వైపు రాజ్యాంగ పరిరక్షణ దినం జరుపుతూ రాజ్యాంగ సంక్షోభాలు తెస్తారు. ఇపుడు మహారాష్ట్ర విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రజాస్వామ్య ప్రియులకు ఆనందం కలిగిస్తోంది. ఒకనాడు ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన కాషాయం పార్టీ వారసులు ఇపుడు చేస్తున్నదేంటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇకనైనా దేశంలో ప్రజాస్వామ్యం బతికేలా తమ వంతుగా క్రుషి చేయాలి. తేడా పార్టీ అంటే ఇలా కాదు అని తెలుసుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: