బొత్స సత్యనారాయణ రాజధానిపై గత కొద్ది రోజులుగా చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను, నిన్న శ్మశానంతో పోల్చి మరో రేంజ్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ఈ అంశాన్ని అంది పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. నేతలందరూ ప్రభుత్వంపై ఒక్క సారిగా ఎదురుదాడికి దిగారు. ప్రజా రాజధానిని శ్మశానంతో పోల్చి ఆంధ్రులనే కాదు.. శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా అవమానించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మంమడిపడ్డారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం మీ కళ్లకు శ్మశానంలా కనిపిస్తున్నాయా, రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా.. అని ప్రశ్నిచారు. ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదని, అమరావతి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే బొత్సను బర్తరఫ్ చేయాలని చంద్రబాబు జగన్ ను డిమాండ్ చేశారు. 

 

 

     మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బొత్సపై మరింత ఘాటుగా విరుచుకుడ్డారు. ప్రజా దేవాలయం శాసనసభను శ్మశానంతో పోల్చుతారా, సచివాలయం వీళ్లకు శ్మశానంలా కనిపిస్తోందా? సీఎం, మంత్రులు శ్మశానంలో కూర్చొని పాలన చేస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసులిస్తామని యనమల ప్రకటించారు. నారా లోకేష్ కూడా, బొత్సపై విభిన్నమైన విమర్శలు చేశారు. ఇన్నాళ్ళూ బొత్స మెదడు అరికాల్లో ఉందనుకున్నా, అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తేలిపోయిందని సెటైర్ వేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం.. వైసీపీ నేతలకు అర్థమవుతుంది అనుకోవడం అత్యాశేనన్నారు. వైసీపీ నేతలు కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారన్నారు. 

 

 

     రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు, రాయలసీమ నేతలు కూడా బొత్స ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బొత్సను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బొత్స ప్రకటన రాజధాని రైతుల్లోనూ అసంతృప్తికి కారణం అయింది. ఓ వైపు నిర్మాణాలు ఆపవద్దని జగన్ ఆదేశించన వార్త హైలెట్ అయిన సమయంలోనే బొత్స శ్మశానం వ్యాఖ్యలు చేశారు. ఇదంతా.. రాజధానిపై జరుగుతున్న గేమ్ ప్లాన్ ఏమో అనే అనుమానాలు రాజధాని రైతుల్లో ప్రారంభమయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: