తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్న బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించబోతుంది..? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా? పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై అటు పార్టీలోనూ, రాష్ట్రంలోనూ హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. 

 

బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల సందడి నెలకొంది.  తెలంగాణలోనూ బూత్ కమిటీ, మండల కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు లోపు జిల్లా కమిటీలు కూడా వేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15 వరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తి కావాలి. ఆ తర్వాత జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.

 

తెలంగాణ కమలం బాస్ ఎవరుంటే బాగుంటుందనే విషయమై హై కమాండ్ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కృష్ణదాస్ ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమై.... వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేది ఎవరనేదానిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోసారి లక్ష్మణ్‌కే అవకాశం కల్పిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. మెజార్టీ నేతలు లక్ష్మణ్‌పై వైపే మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

 

ప్రస్తుత పరిస్థితిలో లక్ష్మణ్ అయితేనే పార్టీకి అడ్వాంటేజ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానికి పలు కారణాలు కూడా చెబుతున్నారు కమలనాథులు. లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీలో ఎక్కువ సంఖ్యలో చేరికలు జరిగాయనీ....మరొకరు అధ్యక్షుడు అయితే కొత్తగా చేరినవారు అభద్రతా భావానికి లోనయ్యే అవకాశంఉందంటున్నారు. మరోవైపు, అధ్యక్ష పదవిపై పార్టీలోని మరికొందరు నేతలు ఆశలుపెట్టుకున్నారు. అధిష్టానం మరోసారి లక్ష్మణ్‌ కి జైకొడుతుందా? లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తుందా? అనేది నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికే లక్ష్మణ్ కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశముందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు లోలోన ప్రయత్నాలు సాగిస్తున్నా.. అధిష్టానం మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: