రాజధాని అమరావతేనా..? సీఆర్డీఏ పరిధిలోని భవనాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో కొనసాగించాలంటూ  సీఎం జగన్‌ ఇచ్చిన సంకేతాలకు అర్థమిదేనా..? రాజధానిపై ఏపీ రాజకీయాల్లో హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్న క్రమంలో సీఆర్డీఏపై సీఎం జగన్‌ ఆదేశాలతో.. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీకి వచ్చినట్టే కన్పిస్తోంది. 


రాజధాని పరిస్థితేంటి..? ప్రస్తుతమున్న ప్రాంతంలోనే రాజధాని ఉంటుందా..? లేక వేరే ప్రాంతానికి తరలి వెళ్తుందా..? అనే అనుమానాలను నివృత్తి చేసే దిశగా సర్కార్‌ నెమ్మదిగా సంకేతాలిస్తోన్నట్టు కన్పిస్తోంది. సీఆర్డీఏపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహించిన సమీక్షలో రాజధానిపై క్లారిటీ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాల పరిస్థితి.. అవి ఎంత వరకు వచ్చాయి..? ఇంకా ప్రారంభించాల్సిన నిర్మాణాల పరిస్థితేంటీ? అనే అంశంపై అధికారుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. రాజధాని పరిధిలోని నిర్మాణాలతోపాటు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు.. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్‌ ప్లాట్లు.. వాటిని అభివృద్ధి చేసే విషయం వంటి అంశాల పైనా సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో క్యాపిటల్‌ పరిధిలో నిర్మాణాలను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జగన్‌.

 

మరోవైపు గత ప్రభుత్వం మాదిరిగా అనసరపు ఆర్బాటాలకు పోవద్దని సూచించారు జగన్‌. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. 


 
ఇక ప్రస్తుతమున్న నిర్మాణాలతోపాటు.. పూర్తి స్థాయిలో ప్రారంభం కాని నిర్మాణాలను కూడా ప్రభుత్వం ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగా హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరింగుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వడంతోపాటు.. వాటిని అభివృద్ధి చేయడం.. భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం వంటి వాటిని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాజధాని ముంపు బారిన పడకుండా కృష్ణా నదీ వరద, కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాల పరిస్థితి పైనా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: