రాజధాని అమరావతి ప్రాంతంలోని ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయంపై రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా మందడంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమను మోసం చేసిందని.. జగన్ సీఎం అయ్యాక తమకు పూర్తి న్యాయం చేస్తున్నారని అన్నారు. పార్టీని బతికించుకోవడానికే  చంద్రబాబు రాజధాని పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. 

 

 

రైతులకు టీడీపీ హయాంలో చేసిన అన్యాయానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నిన్న సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు గ్రీన్‍సిగ్నల్ కూడా ఇచ్చారు. భూమిలిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని ఆయన ఆదేశించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం తర్వాత మిగిలిన భూమిని సుందరీకరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయాలన్నీ భూములిచ్చిన రైతులను ఆనందంలో ముంచెత్తాయి. దీంతో వారు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 

 

రాజధాని పనులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 28న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తామని ప్రకటించారు. దీనిపై రైతులు తమ అసహనం వ్యక్తం చేశారు. రాజధానికి చంద్రబాబు వస్తే.. తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం, విద్య, ప్లాట్ల పంపిణీలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. రాజధాని విషయంలో చంద్రబాబు, లోకేశ్ లకు కమీషన్లు అందాయని కూడ ఆరోపించారు. రాజధానిలో 9 వేల ఎకరాలు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నారని కూడా ఆరోపించారు. సమాధానం చెప్పకుండా రాజధానిలో చంద్రబాబు పర్యటించొద్దని కూడా డిమాండ్ చేశారు. గ్రాఫిక్స్‌తో తమను మోసం చేశారని, కమీషన్ల కోసం గత ప్రభుత్వం కక్కుర్తి పడిందని కూడారాజధాని రైతులు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: