ఢిల్లీలో కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజలను గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచే బదులు ఏకంగా బాంబులు పెట్టి చంపేయొచ్చుకదా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా .. ప్రజలను ఎలా ఇబ్బందులనుంచి బయటపడేలా చూడాలంటూ సీరియస్ అయ్యింది. గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై పదిరోజుల్లో  ప్రణాళిక తయారుచేయాలని సూచించింది. 

 

ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రజలు చనిపోవాలని అనుకుంటున్నారా? పంట వ్యర్థాల దహనంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ విరుచుకుపడింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత పంట వ్యర్థాల దహనం మరింత పెరిగిందనీ.... ఇది మీ వైఫల్యం కాదా? అంటూ మండిపడింది. రెండు రాష్ట్రప్రభుత్వాల వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రజలు కాలుష్యంలో మగ్గుతున్నారని చివాట్లు పెట్టింది. పంట వ్యర్థాలపై మీరెలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే ప్రజలు చనిపోయినా ఫర్వాలేదనే కదా మీ ఉద్దేశంటూ ఎండగట్టింది.   

 

ఢిల్లీలో ప్రస్తుతం నరకం కంటే దారుణంగా ఉందనీ, ఇతర దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయని ధర్మాసనం విచారం వ్యక్తం  చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంతాలకు ప్రజలెందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించింది. ప్రజలను బలవంతంగా ఎందుకు గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచాలనుకుంటున్నారు? అంతకంటే ఓ 15 బ్యాగుల పేలుడు పదార్థాలు తెచ్చి అందర్నీ ఒకేసారి చంపేయండి అంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ  ప్రభుత్వానికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదంటూ సీరియస్‌ అయ్యింది. 

 

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య ఉన్న పాలనపరమైన సమస్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ. కేంద్రం, రాష్ట్రాలు విభేదాలను పక్కనబెట్టి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: