హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. సిటీలో మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది డ్రగ్స్ మాఫియా.  గల్లీ గల్లీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. నగరానికి వలస వచ్చే వారితో దందా సాగిస్తున్నాయి ముఠాలు. 

 

కాస్త విరామం తరువాత మళ్లీ సిటీలో డ్రగ్స్ దందా పోలీసులకు దడపుట్టించింది. ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టామనుకున్న పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. డ్రగ్స్‌ మాఫియా సైలెంట్‌గా సరఫరా చేస్తూ పని కానిచ్చేస్తోంది. ఈ సారి ఏకంగా గల్లీ గల్లీలో వ్యాపారం విస్తరించేలా ప్లాన్ చేసింది. 

 

ప్రైవేట్ రవాణాను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ ముఠాలు తెగ రెచ్చిపోతున్నాయి. సిటీకి వలస వచ్చే వారికి డబ్బులు ఎరగా వేసి చేతినిండా సంపాదిస్తున్నాయి. అలాంటి ఓ  వ్యాపారాన్నే సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. రాజస్థాన్ కు చెందిన గంగారాం బిష్నోల్ అనే వ్యక్తి 11 సంవత్సరాల కిందట నగరానికి వలస వచ్చాడు. మల్కాజిగిరిలోని వివిన్ పేపర్ ప్రోడక్ట్స్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం తన విలాసాలకు సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం వెంపర్లాడాడు. డ్రగ్స్ దందానే బెటర్ అని భావించి తన సోదరుడితో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా సిటీకి డ్రగ్స్ ను సరఫరా చేసి విక్రయాలు మొదలు పెట్టాడు. నగరంలో డ్రగ్స్ సమస్య సమసిపోయిందని అనుకునేలోపు పోలీసులకు మళ్లీ దీని వాసన గుప్పుమంది. అంతే నిఘా పెట్టిన పోలీసులు సుచిత్రా సర్కిల్ వద్ద గంగారాంని అదుపులోకి  తీసుకున్నారు. మరో నిందితుడు బిక్కారం పరారయ్యాడు. 

 

గంగారం వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే నాలుగున్నర కేజీల ఓపియం డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడి కాల్‌డేటాపై ఫోకస్ పెట్టిన పోలీసులు అతడు ఎవరెవరికి విక్రయాలు చేశాడు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. విక్రయించే వారే కాదు.. కొన్నవారికి తిప్పలు తప్పవంటున్నారు పోలీసులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: