హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ నగరవాసుల్లో ఒకింత భయానికి గురిచేసింది. ఆటోకోసం వెయిట్ చేస్తున్న మహిళపై.. ఫ్లై ఓవర్ పైనుంచి దూసుకొచ్చిన వచ్చిన కారు  ఉన్నట్టుండి కారు పడి.. ఆమె చనిపోయింది. ఇదే ప్రజలను ఒకింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఏ ఫ్లై ఓవర్ వద్ద నిలబడినా నగరవాసి ఆందోళనకు గురవుతున్నాడు. 

 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలంటూ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు మంత్రి కేటీఆర్‌. ఫ్లైఓవర్‌ డిజైన్‌, ప్రమాద నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. 

 

బయో డైవర్సిటీ ప్రమాదంపై పోస్టుమార్టం జరుగుతోంది. నిర్మాణపరమైన లోపాలేమున్నాయో తేల్చేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, నిర్మాణ కంపెనీ, కన్సల్టెంట్‌ సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీ ఫ్లై ఓవర్‌పై పర్యటించింది. ఆ తర్వాత పలు సూచనలను ప్రభుత్వానికి నివేదించింది. ఫ్లై ఓవర్‌పై వేగం 40కి మించకుండా కట్టడి చేయాలని నిర్ణయిస్తూ.. అందుకు ఏమేం చేయాలో ప్రత్యేక సూచనలు చేసింది. ప్రస్తుతం మూడు చోట్ల మాత్రమే ఉన్న రంబుల్‌ స్ట్రిప్స్‌ను పదికి పెంచాలని... వీటి ఎత్తును కూడా రెట్టింపు అంటే.. 15 మీల్లి మీటర్లు చేయాలని నిర్ణయించింది. 

 

వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినా.. పొరపాటుగా వేగంతో వెళ్లాలని చూసినా.. ఫ్లైఓవర్‌పై వేగం తగ్గేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదనలు చేసింది బృందం. ఫ్లైఓవర్‌కు రెండువైపులా మలుపు ప్రాంతంలో క్రాష్‌ బారియర్‌ రోలర్స్‌ ఏర్పాటు చేయాలనీ... డిజైనింగ్‌ సంస్థ ఆమోదిస్తే రెయిలింగ్‌ ఎత్తును పెంచాలని నిర్ణయించింది. నిబంధనల మేరకే రెయిలింగ్‌ ఎత్తు ఉన్నప్పటికీ ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో.. ఎత్తు పెంచాలనీ, ఫ్లైఓవర్‌కు కొంత దూరం నుంచే ఇండికేషన్, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది బృందం. 

 

ఫ్లై-ఓవర్‌పై పర్యటించిన బృందం వేగ నియంత్రణపైనే ఎక్కువ దృష్టి సారించింది. ప్రమాదాల నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే తిరిగి వాహనాలను అనుమతించాలనీ, ఇందుకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని అంచనా వేసింది బృందం. 

మరింత సమాచారం తెలుసుకోండి: