అన్నివ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించిన అయోధ్య తీర్పు విష‌యంలో...మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా నడుస్తున్న అయోధ్య కేసులో తుది తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయానికి వచ్చి తీర్పు వెలువరించింది. అయితే, అయోధ్యలో రామాలయ నిర్మాణం విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలా వద్దా అనే అంశంపై సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు తాజాగా కీల‌క నిర్ణయం తీసుకుంది.  అయోధ్య తీర్పు వెలువడినప్పట్నించి రివ్యూ పిటిషన్‌పై జరుగుతున్న చర్చకు సున్నీ వక్ఫ్ బోర్డు తెరదించింది. రివ్యూ పిటిషన్ వేసేది లేదని మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సున్నీ బోర్డు బాధ్యులు వెల్ల‌డించారు. 

 

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు వెలువ‌డిన రోజున‌ సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని.. అయినా గౌరవిస్తామన్నారు. త్వ‌ర‌లో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అయితే, ఆ త‌ర్వాత రెండు కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. వన‌వంబర్ 16వ తేదీన సున్నీ వక్ఫ్ బోర్డు సమావేశమైంది. దీనికి తమ తరపున వాదించిన అడ్వకేట్లను కూడా ఆహ్వానించారు వక్ఫ్ బోర్డు సభ్యులు. సుదీర్ఘంగా జరిగిన ఆనాటి సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు వెళ్ళే అవకాశాలను పరిశీలించాలని సీనియర్ అడ్వకేట్లను కోరింది బోర్డు. దాంతో దాదాపు వారం రోజుల పాటు రివ్యూ అవకాశాలను పరిశీలించిన న్యాయవాదులు సాధ్యాసాధ్యాలను బోర్డుకు నివేదించారు. జావెద్ అక్తర్, షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా వంటి బాలీవుడ్ ముస్లిం ప్రముఖులు చాలా మంది ఈ వివాదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ముగింపును గౌరవించాలని, వివాదాన్ని కొనసాగించేలా రివ్యూ పిటిషన్‌కు వెళ్ళ వద్దని సున్నీ వక్ఫ్ బోర్డుకు సూచించారు.

 

ఇలా మెజార్టీ వ‌ర్గాలు సూచించిన నేప‌థ్యంలో మంగళవారం లక్నోలో సమావేశమైన సున్నీ వక్ఫ్ బోర్డు సమావేశంలో ఓటింగ్ నిర్వ‌హించారు. హాజరైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు మాత్రమే రివ్యూకు వెళ్ళాలని పట్టుబట్టగా.. మిగిలిన ఆరుగురు వద్దని వారించినట్లు సమాచారం. దీంతో మెజార్టీ నిర్ణ‌యం మేర‌కు రివ్యూ పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: