మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మలుపులు, మరెన్నో పిలుపులు, అలకలు, కేకలు, గోలలు ఇలా అన్నీ జరిగాయి. మూడు నెలల క్రితం ఓటేసిన ప్రజలకు ఇదీ ప్రభుత్వమని ఇప్పటివరకూ మాత్రం ఎవరూ  చూపించలేకపోయారు. క్యాంప్ రాజకీయాలతో పాటు కాకలు తీరిన నాయకులు సైతం రోడ్డున పడ్డారు. చివరికి న్యాయస్థానంలో తగిన న్యాయం దక్కింది. డిసెంబర్ 1వ తేదీన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. ఇందులో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి.

 

మహారాష్ట్ర పీఠాన్ని మొదటిసారిగా అధిష్టిస్తోంది ఠాక్రే కుటుంబం. బాలఠాక్రే స్థాపించిన శివసేనలో ఇప్పటివరకూ ఆ కుటుంబ సభ్యులు అధికారిక పదవులు ఏవీ  అనుభవించలేదు. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం శివసేన పరమైంది. నాడు బాల్ ఠాక్రే తనకు విశ్వాసపాత్రునిగా ఉన్న మనోహర్ జోషీని ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన అయిదేళ్ళ పాటు పాలన చేశారు.

 

ఇక తిరిగి రెండు దశాబ్దాల తరువాత శివసేనకు సీఎం పీఠం దక్కుతోంది. బాలఠాక్రే  కుమారుడు అయిన ఉద్ధవ్ ఠాక్రే  ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయన కనీసం ఉభయ సభల్లో సభ్యుడుగా కూడా లేరు. పైగా చట్టసభల్లో అడుగుపెట్టడం ఆయనకు ఇదే ప్రధమం. ఇక ఆయన కుమారుడు 29 ఏళ్ళ ఆదిత్య ఠాక్రేకు కూడా తొలిసారి అనుభవమే. ఆయన కూడా ఫస్ట్ టైం  ఎమ్మెల్యేగా నెగ్గి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు.

 

నిజానికి ఉధ్ధవ్ ఠాక్రే అంతగా సీఎం సీటు కోసం పట్టుబట్టింది తన కుమారుడు కోసమే. తన వారసుడు సీఎం కావాలని ఆయన మూడు దశాబ్దాల బీజేపీతో మిత్రత్వాన్ని తెంచుకున్నారు. అయితే ఇపుడు ఆయన్ని కాదని ఉద్ధవ్ సీఎం అవుతున్నారు. చిన్న వయసు కావడంతోనే ఆదిత్య వైపు కూటమి నేతలు  ఎవరూ మొగ్గు చూపలేదు. మొత్తం మీద తండ్రీ కొడుకులు మొదటిసారి అసెంబ్లీలో మెరియబోతున్నారన్న మాట. మరి ఎలా నెగ్గుకువస్తారో ఏమో

 

మరింత సమాచారం తెలుసుకోండి: