న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఆర్టీసీ సమ్మె ను జేఏసీ నేతలు అర్ధాంతరంగా ముగించడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది .  ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి ఒకే చెప్పకపోయినప్పటికీ , సమ్మె విరమించాలని నిర్ణయించడం వెనుక ఆంతర్యం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు .  సూర్యాపేట డిపో కు చెందిన రవి నాయక్ అనే కార్మికుడు అర్ధాంతరంగా సమ్మె విరమించడం పట్ల ఒంటిపై పెట్రోల్ పోసుకుని , జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ని తీవ్ర శాపనార్ధాలు పెట్టారు .  30  మంది కార్మికుల ఉసురు తగులుతుందని అశ్వత్థామ ను రవి నాయక్ తిట్టిపోశారు .

 

 అసలు నువ్వు మనిషివేనా , కేసీఆర్ కు అమ్ముడుపోయి ఆర్టీసీని తాకట్టు పెట్టావంటూ నిందించాడు  .  ఆర్టీసీ సమ్మె విరమణ అన్నది నవ్వులాటగా మారిందని పలువురు కార్మికులు ఎద్దేవా చేస్తున్నారు .  ఆర్టీసీ కార్మికుల కేసును హైకోర్టు లేబర్ కోర్టు కు సిఫార్స్ చేసిన వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ నేతలు , అంతలోనే సమ్మె యధావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు . తిరిగి రెండు రోజుల వ్యవధిలోనే మళ్ళీ సమ్మె విరమించి విధుల్లో చేరుతామని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు . అయితే ఇక  మంగళవారం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని  దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన  హైకోర్టు  , ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా కారణమవుతుందన్న ప్రశ్నించింది  . యూనియన్ నేతలు సమ్మెకు పిలుపునిస్తే ప్రభుత్వం  కారణం ఎలా అవుతుందని న్యాయస్థానం నిలదీసింది .

 

 కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఎక్కడ ప్రభుత్వం ప్రకటించలేదు ... కదా అంటూ పిటిషనర్ ను  ఎదురు ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. ప్రభుత్వ తీరు వల్లే పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా రాసిన సూసైడ్ నోట్ల ను ఈ సందర్బంగా పిటిషనర్ కోర్టు కు సమర్పించినా, ఈ విషయం లో ప్రభుత్వానికి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది .

మరింత సమాచారం తెలుసుకోండి: