నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం వేళ.. వైసీపీ మంత్రి కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ పై ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఈ రోజు ఓటుకు కోట్ల కేసు వరకు ఏది రాజ్యాంగబద్ధం చేశారని ప్రశ్నించారు. విలువ లేని నాయకుడు చంద్రబాబు. ఐదేళ్లు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయాడన్నారు. కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీ మంత్రి లేని పరిస్థితిని నెలకొల్పారని విమర్శించారు.

 

 

రాజకీయాల్లో విలువలు లేకుండా చేసిన నాయకుడు ఎవరు అని దేశంలో ఎవరిని అడిగినా చంద్రబాబు అనే చెబుతారన్నారు కన్నబాబు. అలాంటి వ్యక్తి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. బాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి చేసిన ట్వీట్లు హాస్యాస్పదమన్నారు.

 

 

డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పౌరహక్కులను కాపాడుతున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావాలని జగనన్న అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియం బోధన, ప్రజల హక్కులను కాపాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇవన్నీ తట్టుకోలేక కొందరు రకరకాల దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.

 

 

సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రతీ పథకం రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులను కాపాడేలా ఉన్నాయన్నారు మంత్రి కురసాల కన్నబాబు . అణగారిన వర్గాలను ఆదుకుకోవడం మొదలుకొని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం పనుల్లో, పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రతీ అంశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ముందుకువెళ్తురని వివరించారు మంత్రి కురసాల కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: