తెలంగాణ రాష్ట్రంలో వీలీనమే ప్రధాన డిమాండ్ గా సమ్మెకు దిగిన ఆర్టీసి కార్మికులు, ప్రభుత్వం బెట్టు వీడకపోవడంతో సమ్మె ను అర్ధంతరంగా ముగించారు. 52 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె కొనసాగడం, సెప్టెంబర్ నెల నుంచి కార్మికులకు జీతాలు అందక పోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ఆర్టీసి కార్మికులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష భేటీ నిర్వహించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 26 న ఉదయం 6 గంటలకు కార్మికులు విధుల్లో చేరుతారని ఆర్టీసి జేఏసీ ప్రకటించింది. 

 

నిన్న పెద్దఎత్తున విధుల్లో చేరడానికి డిపోల దగ్గరకి ఆర్టీసి కార్మికులు వచ్చారు. అయితే డిపో మేనేజర్లు మాత్రం కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించారు. నిన్న నిజామాబాద్‌ జిల్లా ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ఒక ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ఆర్టీసి కార్మికులు మూకుమ్మడిగా డిపో మేనేజర్ కాళ్ళపై పడి "అయ్యా కెసిఆర్ సారూ తప్పయ్యింది,  ఇంకోసారి సమ్మె చెయ్యం, నువ్వు చెప్పినట్లే వింటాం, మా ఉద్యోగాలు మాకు ఇవ్వు సారూ" అని ఏడుస్తూ వేడుకున్నారు. "మా కుటుంబాలు రోడ్డున పడ్డాయ్, కనీసం ఇంటి అద్దె కూడ చెల్లించడానికి డబ్బులు లేవు మమల్ని ఉద్యోగాల్లో చేర్చుకోండి" అంటూ కార్మికులు వేడుకున్నారు. 

 

డిపో మేనేజర్ "నా చేతుల్లో ఏం లేదు ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకోవాలి నేను" అని సమాధానం ఇచ్చారు. ఆర్టీసి కార్మికుల దయనీయ స్థితిని చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ డిపోల వద్ద పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. డిపోల దగ్గర ఆందోళన నిర్వహించాలని వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కొన్ని డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ అమలు చేశారు. 

 

ఆర్టీసి సమస్య కి ఒక శాశ్వత పరిష్కారం చూపే విధంగా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో సీఎం కెసిఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైకోర్టు 5100 రూట్లకు ప్రైవేటీకరణ కు అనుమతినివ్వడంతో, ఆర్టీసి సిబ్బంది కుదింపు పైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. 

మరింత సమాచారం తెలుసుకోండి: