తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రైవేటు పర్మిట్లతో ఇప్పటికే 5,100 బస్సులను తిప్పేందుకు అనుమతించే విషయంలో కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ పరిధిలో మిగతా సగం బస్సులను ఎలా నిర్వహించాలన్న అంశాన్ని ఖరారు చేయనుంది. గురువారం దీనికి సంబంధించి జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సగం బస్సులను ఆర్టీసీ అధీనంలో ఉంచి మిగతా సగం రూట్లకు స్టేజీ క్యారియర్‌ పర్మిట్లు జారీ చేసి, యజమానులు, ప్రైవేటు బస్సులు తిప్పుకునేలా ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే.

 

 

ఇక మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమించిన నేపథ్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రివర్గ భేటీలో సర్కారు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇకపోతే సగం బస్సులను ప్రైవేటీకరిస్తే మిగతా సగం బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీకి తక్కువ మంది సబ్బందే అవసరమవుతారు. కానీ సమ్మె చేసిన 49,300 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటే సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. దీంతో వీఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేసి అదనంగా ఉన్న వారిని ఇళ్లకు పంపే అవకాశం ఉంటుందనే దిశగా కేసీయార్ ఆలోచనలు సాగుతున్నాయని తెలుస్తుంది..

 

 

ఇందుకు గాను ఈ అంశంపై కసరత్తు చేసి కేబినెట్‌ సమావేశమయ్యేలోగా 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి వీఆర్‌ఎస్‌ వర్తింపజేయాలనే దిశగా సమాచారాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు నాలుగైదేళ్ల తర్వాత ప్రైవేటు పర్మిట్ల విధానం ప్రారంభిస్తే ఈలోగా పదవీవిరమణ రూపంలో సిబ్బంది సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.

 

 

ఇదేకాకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే మాత్రం యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేసేలా అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలనే షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఇకపై సమ్మెల జోలికి వెళ్లబోమని కూడా కార్మికులు నిర్దిష్ట హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి లేని నేపథ్యంలో వేతన సవరణ గడువును నాలుగేళ్ల నుంచి సడలించి ఐదారేళ్ల గడువు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ షరతులను కూడా ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు వచ్చిన సమస్య ఇక భవిష్యత్తులో రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: