మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి శివసేన చీఫ్ ఉత్ధవ్ ఠాక్రే  ముహూర్తం పెట్టుకున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటలకు శివాజి పార్కులో ప్రమాణ స్వీకారం చేయటానికి వేదిక కూడా నిర్ణయమైంది. ఇలాంటి నిర్ణయమే గతంలో కూడా ఒకసారి చేసిన తర్వాత బిజెపి చేతిలో  బోల్తా పడ్డారు.

 

అందుకనే ముందు జాగ్రత్తగా ఈసారి తమ ఎంఎల్ఏలపై తాము నిఘా పెట్టుకుని మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. సరే ఎలాగూ బలనిరూపణ దాకా వెయిట్ చేయకుండానే బిజెపి చేతులెత్తేసింది కాబట్టి ఇప్పటికిప్పుడు మూడు పార్టీల కూటమికి వచ్చిన సమస్య ఏమీ లేదనే చెప్పాలి.

 

ఏదెలాగున్నా గురువారం ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ ఉత్ధవ్ కూడా బలనిరూపణ చేసుకోవాల్సొస్తుందేమో. నిజంగా ఆ పరిస్ధితే వచ్చిన మూడు పార్టీల కూటమికి వచ్చిన సమస్యలు కూడా ఏమీ ఉండదనే అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ఒక్కసారిగా ఉత్ధవ్ జాక్ పాట్ కొట్టినట్లే అనుకోవాలి. ఎందుకంటే శివసేన పెట్టినప్పటి నుండి ఠాక్రే కుటుంబం నుండి ఎవరూ పోటి చేసింది లేదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

 

మొన్నటి ఎన్నికల్లోనే మొదటిసారి ఠాక్రే కుటుంబం నుండి పోటి చేశారు. ఉత్ధవ్ కొడుకు 29 ఏళ్ళ  ఆదిత్య ఠాక్రే పోటి చేసిన మొదటిసారే గెలిచారు. దానికితోడు బిజెపి+శివసేన కూటమికి మెజారిటి సీట్లు రావటంతోనే సిఎం కుర్చీ కోసం శివసేన పట్టుపట్టటంతో వివాదం మొదలైంది. సరే చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అందరూ చూసిందే.

 

కొడుకు కోసం ఉత్ధవ్ మొదలుపెట్టిన పేచీలో  చివరకు తానే కేంద్రబిందువుగా మారాల్సొచ్చింది. అందుకనే పోటి చేయకపోయినా ఉత్ధవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తండ్రే ముఖ్యమంత్రి కాబట్టి బహుశా కొడుకు తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా పోటి చేయకపోయినా, చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగిన మరాఠా రాజకీయాల్లో జాక్ పాట్ కొట్టి  ఉత్ధవ్ సిఎంగా బాధ్యతలు తీసుకోవటం నిజంగా విచిత్రమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: