తెలుగుదేశం పార్టీ అధినేత ఇపుడు మాత్రం పూర్తిగా కంటినిండా కునుకు తీస్తున్నారని ఎవరైనా అనుకుంటున్నారా... చంద్రబాబుకు ఆరు నెలల క్రితం వచ్చిన ఘోరమైన పరాజయం తరువాత బాబు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారన్నది అంతా కళ్ళముందే చూస్తున్నారు. ఇక బాబుకి ఒక వైపు పార్టీ ఏమైపోతోందన్న బెంగ మరో వైపు ఏపీలో మళ్ళీ అధికారం దక్కుతుందా అన్న  చింత అసలు  కొన్ని నెలలుగా బాబుకు నిద్రకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందిగా.

 

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ మంత్రి అనిల్ కుమార్ తాము అనుకున్న విధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపిస్తామని, అపుడు చంద్రబాబుతో సహా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నిద్రలేని రాత్రులే మిగులుతాయని అంటున్నారు. పోలవరం పనులు తమ హయాంలో చకచకా సాగుతూంటే అబద్దాలు చెప్పి టీడీపీ పెద్దలు జనాలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించారు.

 

ఇదిలా ఉండగా 2021 నాటికి పోలవరం రాక్ ఫిల్ డ్యాం పూర్తి అవుతుందని కూడా ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పూర్తి చేశామని టీడీపీ చెప్పిందంతా తప్పు అని ఆయన అన్నారు. ఇప్పటికి 30 శాతం పనులే జరిగాయని కూడా అనిల్ అంటున్నారు. ఇదిలా ఉండగా  55 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్ పనులలో 50 శాతానికి పైగా పునరావాస పనులకు వెచ్చించాల్సిఉందని మంత్రి చెప్పారు.

 

కనీసం వాటి గురించి ఆలోచన చేయకుండా పోలవరం 70 శాతం పూర్తి అయిందని టీడీపీ ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. మొత్తం నిధులలో 16వేల కోట్లు మాత్రమే ఇప్పటికి ఖర్చు అయ్యాయని, ఇక రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన 5 వేల కోట్లలో గత రెండేళ్ళుగా కేంద్రం నుంచి రూపాయి కూడా గత  రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని ఆయన అంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే 1800 కోట్లను కేంద్రం నుంచి విడుడల చేయించామని ఆయన చెప్పారు. 

 

తమ మొదటి ప్రయారిటీ పోలవరం అని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి కలసినపుడల్లా మొదటి మాటగా పోలవరం గురించే చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు.  ఎవరెన్ని అనుకున్నా కూడా పోలవరం పనులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ మరో రెండేళ్ళలొ  ప్రారంభిస్తారని, అపుడు బాబు, దేవినేని ఉమా వంటి వారు కళ్ళారా చూడవచ్చునని కూడా ఆయన‌ సెటైర్లు వేశారు. అంటే బాబుకి నిద్రతో శాశ్వతంగా వైసీపీ సర్కార్ యుధ్ధం పెట్టేయాలనుకుంటోందా. ఏమో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: