భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో.. మరోసారి సత్తా చాటింది. మొన్నటి చంద్రయాన్ వైఫల్యాన్ని మరిపించేలా మరో విజయం సాధించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 47ను అంతరిక్షంలోకి విజయవతంగా ప్రయోగించింది. ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ47 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

 

పీఎస్‌ఎల్‌వీ సీ-47 ద్వారా కార్టోశాట్ 3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వివిధ దశల్లో మొత్తం ప్రక్రియను 26.30 నిమిషాల్లో 14 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఎప్పటిలాగానే... నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది.

 

ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-47 ద్వారా హై రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్ 3ని రూపొందించారు. ఇకఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపిన మిగిలిన 13 ఉపగ్రహాలు... కమర్షియల్ నానో శాటిలైట్లు.. ఇవన్నీ అమెరికాకు చెందినవి. ఈ ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో ఛైర్మన్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటుందని ధీమాగా చెప్పారు.

 

ఈ ప్రయోగానికి ముందు... కార్టోశాట్ విజయం కోసం ప్రార్థిస్తూ ఇస్రో ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ -సీ47 కార్టోశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభించిన నేపథ్యంలో.. ఆయన తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

 

కార్టోశాట్ నమూనా పత్రాలను స్వామివారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలను చేశారు. మొత్తానికి కార్టోశాట్ ప్రయోగం ద్వారా ఇస్రో మరోసారి తన సత్తా చూపించింది. ఇక వచ్చే ఏడాది చంద్రయాన్ 3 కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: