రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగుతున్నారు.. ఈ ప్రశ్న అడిగితే చటుక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే మనం నీరు తాగడంపై అంతగా దృష్టి సారించం. అదో ముఖ్యమైన అంశంగా పట్టించుకోం. ఏదో దాహమైతే తప్ప.. నీళ్ల జోలికి వెళ్లని వారు చాలా మంది ఉంటారు. కానీ శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే ఏమవుతుంది. అసలు నీళ్లు ఎందుకు తాగాలి. ఇప్పుడు చూద్దాం..

 

ఆరోగ్యం బావుండాలంటే నీరు తగినంత తీసుకోవాల్సిందే. నీరు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది. మలబద్దకం ఏర్పడుతుంది. అంతేకాదు.. తలనొప్పి, తలతిరగడం, అలసట, నిస్సత్తువ, అందోళన వంటి సమస్యలూ కలుగుతాయి. శరీరంలో నీరు తక్కువైతే.. కండరాల నొప్పులు, బలహీనతతో, కాళ్లు చేతులు చల్లబడతాయి కూడా. చర్మం పొడిబారి కాంతివిహీనమవుతుంది. నోరు ఎండిపోయి దుర్వాసన వస్తుంది.

 

నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల మూత్ర విసర్జన సరిగా జరగదు. దీని వల్ల కిడ్నీలు పాడవుతాయి. అంతే కాదు.. నీరు సమయానికి తాగకపోతే వివిధ కణాలు చిన్నచిన్న గడ్డలుగా ఏర్పడి.. గుండెకు రక్తాన్ని అందించలేవు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అంతా నీళ్లు బాగానే తాగుతారు. కానీ.. చల్లగా ఉన్నప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోరు.

 

శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు. నీళ్లు తాగితే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం, బైకార్బొనేట్లు తదితర ఖనిజాలతోపాటు లవణాలు శరీరంలోకి చేరుతాయి. అవయవాల్లోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీర ఉష్ణోగ్రతలు నీటి వల్లే నియంత్రణ అవుతాయి. శరీరంలో 60 శాతం నీరుంటేనే జీర్ణక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయి. వెన్నుపూస, కీళ్ల మధ్య కందెన తయారవడంలో నీటిదే కీలకపాత్ర. కాబట్టి రోజుకు సుమారు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: