పాక్‌ ప్రధానికి భారత్‌ రైతుల బంపరాఫర్‌..! దావూద్‌ను భారత్‌కు అప్పగిస్తే.. టమాటా రేట్‌ తగ్గిపోతుందంటున్నారు. ఇంతకీ ఏంటా కధ? 

 

పాకిస్థాన్ లో టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య ప్రదేశ్ రైతులు వినూత్న పరిష్కారాన్ని సూచించారు. పాకిస్థాన్ లో టమోటా ధరలు దిగివస్తే కేవలం కూరగాయల ధరలు తగ్గడం మాత్రమే కాకుండా...ఇరు దేశాల మధ్య సారమస్య వాతావరణం కూడా ఏర్పడుతుందని సలహా ఇచ్చారు. ఈ మేరకు జబువా రైతు సంఘం పాక్ ప్రధానికి లేఖ రాసింది. మధ్య ప్రదేశ్ నుంచి పాకిస్థాన్ కు టమోటాలు పంపించాలంటే కొన్ని షరతులకు ఇమ్రాన్ ఒప్పుకోవాల్సిందేనని కూడా రైతులు సూచించారు. ''పారిపోయి వచ్చి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలని రైతులు కోరారు. 26/11 ముంబై దాడులకు పాల్పడినందుకు క్షమాపణ చెప్పాలి...'' అని డిమాండ్ చేశారు.

 
పాకిస్థాన్ లో కిలో టమోటా ధర 400రూపాయలు పలుకుతోంది. ఈపరిస్థితుల్లో రైతులు ఇలా స్పందించడంపై చర్చ సాగుతోంది.  గత కొన్నేళ్లుగా జబువాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకించి పెట్లవాద్ నుంచి పాకిస్థాన్ కు టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా రైతులు ఎగుమతి నిలిపివేశారు. అయితే ...రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రైతులు ''పీవోకే ఇచ్చేయ్...టమోటాలు తీసుకెళ్లు'' అన్న నినాదంతో ఆందోళన కూడా నిర్వహించారు. మొత్తానికి...మధ్యప్రదేశ్‌ రైతుల ఆఫర్‌పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. 

 

టమోటా ధరల పెరుగుదలతో పాకిస్థాన్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా టమోటా ధరలను తగ్గించి తమను ఆదుకోవాలని పాక్ ప్రధానిని వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ రైతులు ఇచ్చిన ఆఫర్ ను పాక్ ప్రధాని సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: