ఇలా వచ్చారు.. అలా దోచుకెళ్లారు..! ఒకటి కాదు రెండు కాదు.. 8వేల కోట్ల రూపాయలు విలువ చేసే నగలు.. ఎత్తుకెళ్లారు. ఎలక్ట్రిక్‌ కంచెను ఛేదించుకొని, మూడో కంటికి కన్పించకుండా పారిపోయారు.  ధూమ్‌ సినిమాను తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. జర్మనీ చరిత్రలో అతిపెద్ద దోపిడిగా నిలిచిపోయింది. 

 

జర్మనీలో దొంగలు పడ్డారు. ఓ మ్యూజియంలో చొరబడి విలువైన, అరుదైన వజ్రాలు, నగలను ఎత్తుకెళ్లారు. రూ.8వేల కోట్లు విలువ చేసే నగలతో ఆడీకారులో పరారయ్యారు. డ్రెస్డన్‌ మ్యూజియంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది. దోపిడీ జరిగిన తీరు చూసి పోలీసులే షాకయ్యారంటే.. స్కెచ్‌ ఎలా వేశారో అర్థమవుతోంది. 

 

డ్రెస్డన్‌ మ్యూజియం చుట్టూ కట్టుదిట్టమైన ఎలక్ట్రానిక్‌ భద్రతా వ్యవస్థ ఉంది. దీన్ని దాటుకొని వెళ్లడమంటే ప్రాణాలకు తెగించాలి. అలాంటి దాన్ని సునాయాసనంగా ఛేదించారు. ఈ మ్యూజియానికి అగస్టీస్‌ బ్రిడ్జీ కింద నుంచే కరెంట్‌ సరఫరా అవుతుంది. గమనించిన దొంగలు..ముందుగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను టార్గెట్ చేశారు. నిప్పు పెట్టి కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. మ్యూజియం ఉన్న ప్రాంతానికి కరెంట్ సరఫరా ఆగిపోవడంతో... కిటికీ బద్దలుకొట్టి భవనంలోపలికి ప్రవేశించారు. 

 

వారి టార్గెట్‌ అంతా విలువైన వస్తువులే. లోపలికి వెళ్లగానే..విలువైన వజ్రాలు, నగలను తీసుకున్నారు. మిగతా ఏ వస్తువును టచ్ చేయలేదు. క్షణాల్లోనే అక్కడి నుంచి ఆడీకారులో పరారయ్యారు. అలారమ్‌ మోగి పోలీసులు చేరుకునేలోపే... అక్కడి నుంచి ఉడాయించారు. మ్యూజియానికి వెళ్లే రోడ్లన్నీ మూసివేసి గాలించినా ఫలితం లేదు. మ్యూజియం సీసీటీవీలో దోపిడీ దృశ్యాలు చిక్కలేదు. బయట ఉన్న సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి చేతిలో గొడ్డలితో పట్టుకున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. మ్యూజియానికి సమీపంలోనే మంటల్లో ఉన్న ఆడీకారును గుర్తించారు. దోపిడీకి ఈ కారునే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. ఈ మ్యూజియంలో 41క్యారెట్ల ఆకుపచ్చ డైమాండ్‌ ఉండేది. కొన్ని రోజుల ముందే ఆ వజ్రాన్ని న్యూయార్క్‌లో భద్రపరిచారు. మొత్తం 8వేల కోట్లు విలువ చేసే నగలు, డైమండ్లు చోరికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. దోపిడీని చేదించేందుకు.. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. పెద్ద ముఠా ఉంటుందని భావిస్తున్నారు జర్మనీ పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: