టీడీపీని కడపలో బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు ప్రయత్నానికి తెలుగు తమ్ముళ్లు తూట్లు పొడుస్తున్నారు. క్రమశిక్షణకు టీడీపీ మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు ముందే తమ్ముళ్ల వీరంగం సృష్టించడంతో ఆయన తల పట్టుకున్నారు. రెండు వర్గాలని సముదాయించి, బెదిరించి, అదుపులో పెట్టాను.. అనుకునే సమయానికి ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కేశారు. దీంతో ఈ చర్యలు బాబు గారి తలకు బొప్పి కట్టిస్తున్నాయి.

 

 

నిన్న చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తల బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. కడప నియోజకవర్గం సమీక్షా సమావేశంలో శ్రీనివాసులురెడ్డిపై మరో వర్గం నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న రాత్రి చంద్రబాబు సమక్షంలోనే దళిత కార్యకర్త సుబ్బయ్యపై శ్రీనివాసులు రెడ్డి వర్గీయులు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో బాధితుడు సుబ్బయ్య పోలీసుస్టేషన్‍లో ఫిర్యాదు చేసాడు. శ్రీనివాసులు రెడ్డి అండతోనే తనపై దాడి చేశారని సుబ్బయ్య పోలీసులకు తెలిపాడు. దీంతో శ్రీనివాసులు రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రబాబు వారించినా తెలుగు తమ్ముళ్లు పోలీసుల వరకూ వెళ్లడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. బాబు పర్యటనను జిల్లా నాయకులు విజయవంతం చేస్తారనుకుంటే పార్టీ పరువును బజారున పెట్టారని విమర్శలు వస్తున్నాయి.

 

 

నిజానికి టీడీపీ అధినాయకత్వంపై ప్రతిచోటా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. వల్లభనేని వంశీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, ఆధిపత్య పోరు, వర్గ పోరులతో ఇప్పటికే టీడీపీ సీనియర్ నాయకుల్లో అంతర్మధనం మొదలైంది. ఈ తరహా గొడవలు పార్టీలో వర్గ పోరుకు దారి తీసి పార్టీ బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని తగ్గించేందుకు అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.. అధినేత మాట తమ్ముళ్లు ఏమేరకు వింటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: