రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామ రైతులు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. 28వ తేదీ అంటే గురువారం నాడు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబునాయుడు అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై రైతులు మాట్లాడుతు తమకు క్షమాపణ చెబితే కానీ చంద్రబాబు పర్యటించటానికి వీల్లేదంటూ తెగేసి చెప్పారు.

 

ఐదేళ్ళ కాలంలో ఒక్క శాస్వత కట్టడాన్ని కూడా నిర్మించలేని చంద్రబాబు ఇపుడు రాజధాని ప్రాంతంలో ఎందుకు పర్యటించాలని అనుకుంటున్నారో రైతులకు చెప్పాలట. రాజధాని నిర్మాణం అని చెప్పి  తమ భూములు తీసుకున్న చంద్రబాబు రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారో జనాలకు చెప్పిన తర్వాతే పర్యటనకు రావాలంటూ షరతులు విధించటం కాస్త విడ్డూరంగానే ఉంది.

 

చంద్రబాబు హయాంలో అసైన్డ్ రైతులకు బాగా అన్యాయం జరిగిందని మండిపోతున్నారు. పట్టా భూములకు ఓ ప్యాకేజి, అసైన్డ్ రైతులకు మరో ప్యాకేజిని అమలు చేయటంతో తామంతా నష్టపోయామంటున్నారు అసైన్డ్ భూములిచ్చిన రైతులు. మొత్తం మీద రాజధాని ప్రాంతంలోని రైతులు  అక్కడక్కడ నల్లజెండాలను సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది.

 

చంద్రబాబు పర్యటనను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు దళిత రైతులు, రైతులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి చాలామంది రైతులకు భూములు ఇవ్వటం ఇష్టం లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించటంతో వాస్తవాలు మరచిపోయిన రైతులు రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చారు. అయితే తర్వాత చంద్రబాబు నిజస్వరూపం బయటపడటంతో చివరకు ఎటూకాకుండా పోయారు.

 

మొత్తం మీద రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లుదామని చంద్రబాబు పర్యటన పెట్టుకున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే గడచిన ఐదు నెలల్లో కొత్తగా రాజధాని ప్రాంతంలో జరిగిన నిర్మాణాలంటూ ఏమీ లేవు. ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా అభివృద్ది పరిశీలన అంటూ పర్యటన చేయబోతున్నారంటే ఏమనర్ధం ? అందుకనే అదే బురద రాజకీయాన్ని అధికార పార్టీ కూడా రెడీ చేస్తున్నట్లే ఉంది చూడబోతుంటే. మొత్తానికి మరికొద్ది రోజులు రాష్ట్రం బురద రాజకీయంతో కంపు కొట్టటం ఖాయంగానే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: