‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్కడి పరిస్థితులను చూస్తుంటే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమో’ ఈ కామెంట్లు చేసింది బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా త‌న ప్ర‌స్థానం ముగిసిన అనంత‌రం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి. దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ, ప్రకృతి సమతుల్యతలను పరిశీలిస్తే... హైదరాబాద్ రెండో రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవ‌చ్చున‌ని కొంద‌రు విశ్లేషించారు. అయితే, దీనికి తాజాగా కేంద్రం మ‌రోమారు చెక్ పెట్టింది. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన లేదని కేంద్ర హోం శాఖ పార్ల‌మెంటు వేదిక‌గా... లిఖిత‌పూర్వకంగా క్లారిటీ ఇచ్చేసింది. 

 

కాలుష్యం బ‌దులు బాంబులు వేసి చంపేయండి అని సాక్షాత్తు న్యాయ‌స్థానం ప్ర‌క‌టించే అంత దారుణ‌మైన స్థితిగ‌తుల‌ను రాజ‌ధాని ఢిల్లీ క‌లిగి ఉన్న నేప‌థ్యంలో..రెండో రాజ‌ధాని అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. కీల‌క అంశాలైన నగర విస్తీర్ణం, పర్యావరణం,రోడ్లు, అక్షరాస్యత, తలసరి ఆదాయం, జన సాంద్రత,  ప్రభుత్వ భవంతులు, పరిశ్రమలు, జీవనోపాది, భాషా సంస్కృతులు తదితర అంశాల్లో మిగ‌తా ప్రాంతాలతో పోలిస్తే...హైద‌రాబాద్ టాప్‌లో ఉంది. భౌగోళికంగా ఎలాంటి ముప్పు లేక‌పోవ‌డ‌మే కాకుండా... జలమార్గంలేని హైదరాబాద్ రాజధానిగా అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటుందని కేంద్ర పెద్దలు అంచనా వేసుకున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది. రాజ‌కీయ ఎత్తుగ‌డల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఎంపిక చేయ‌వ‌చ్చ‌ని ప‌లువురు భావించారు.

 

అయితే, ఈ ప్ర‌చారంపై ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ నగరాన్ని దేశ రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనేదీ తమ మంత్రిత్వశాఖలో లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయన ఈ మేరకు స్పందించిన‌ప్ప‌టికీ...తాజాగా రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఓ స‌భ్యుడు ఈ సందేహాన్ని తిరిగి వ్య‌క్తం చేశారు. దక్షిణ భారత్‌లో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా అని ప్ర‌శ్నించారు. దీంతో  హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సంబంధిత ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం కీల‌క క్లారిటీ నేప‌థ్యంలో అయినా...ఈ చ‌ర్చ‌కు చెక్ ప‌డుతుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: