ప్రస్తుతం భారతావని మొత్తాన్ని వణికిస్తున్న అంశం.. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలే. ఇందుకు ప్రధాన కారణం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన పోర్నోగ్రఫీ. అరచేతిలో దొరుకుతున్న అశ్లీల సైట్లు, అందులోని వీడియోల వీక్షణ ఎక్కువ కావటమే. ఇందుకు బలిపోతున్నది మహిళలు, చిన్నారులు. 15ఏళ్ల నుంచి 60ఏళ్ళు పైబడిన వారు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడి లైంగికవాంఛతో రెచ్చిపోతున్నారు.

 

 

 

ఐదారేళ్ల క్రితం వరకూ కూడా లేని లైంగిక దాడి క్రైం రేటు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. లక్షల్లో ఉన్న పోర్న్ సైట్లను అడ్డుకోవడం అసాధ్యంగా మారింది. విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటే సగం పోర్న్ వెబ్ సైట్ల వీక్షణ కారణం. దేశాన్నే నివ్వెరపరిచిన ఢిల్లీ ఘటన అయినా, దేశాన్ని కుదిపేసిన ఆరేళ్ల చిన్నారి ఘటన అయినా, సమాజం ఉనికినే ప్రశ్నించిన వరంగల్ ఘటన అయినా.. వీటన్నింటికి సగం కారణం అశ్లీల సైట్లు చూడటమే. వీటికి ప్రభావితమై చేస్తున్న కామాంధుల వికృత చేష్టలకు చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు బలైపోతున్నారు. పోర్న్ విచ్చలవిడిగా చెలామణీ అయ్యే అనేక దేశాల్లో జరగని దారుణాలు మన దేశంలో జరుగుతున్నాయి. ఈ దురగతాలకు అడ్డుకట్ట వేయాలి. ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చాక మనిషికి అనేక సౌలభ్యాలు వచ్చాయి. ఓ సినిమాలో చెప్పినట్టు.. 'గాలొస్తుందని డోరు తీస్తే.. దుమ్ము కూడా వచ్చింది' అన్నట్టు తయారైంది పరిస్థితి. 

 

 

 

ముఖ్యంగా యువత వీటి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. అవసరానికి ఉపయోగ పడాల్సిన టెక్నాలజీ దుర్వినియోగం కావడం బాధించే విషయం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళుతూ ప్రపంచపటంలో భారతదేశ కీర్తి పతాక ఎగురుతోంది. ఈ సమయంలో నిత్యం జరుగుతున్న ఇటువంటి దారుణాలు భారతదేశ పరువును అదే ప్రపంచపటంలో దోషిగా నిలబెడతాయానడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: