రాజధాని నిర్మాణం అమరావతి విషయంలో చేసింది చెప్పుకోవడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యారా? బాబు పర్యటన హైలైట్ కాకుండా చేయడంలో వైసీపీ మంత్రులు సక్సెస్ అయ్యారా? అంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నవంబర్ 29న అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అక్కడ తమ హయాంలో ఏం నిర్మాణాలు జరిగాయి...మిగిలిన నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది పరిశీలించనున్నారు. అయితే బాబు ఎప్పుడు పర్యటన చేస్తున్నారని ప్రకటించారో అప్పటి నుంచి వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా అడిగేశారు.

 

గత ఐదేళ్లు అమరావతిలో బాబు చేసిందేమి లేదని, అక్కడ ఏముంది శ్మశానం తప్ప బాబు పర్యటించడానికి అంటూ బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. అలాగే ఆవులు, గేదెలు, కుక్కలతో పాటు తిరగడానికి బాబు అమరావతి వెళుతున్నారని కొడాలి నాని మాట్లాడారు. అయితే ఇదే విషయంపై టీడీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు చంద్రబాబు పర్యటన విషయం హైలైట్ చేసుకోవడం ఆపేసి, మంత్రులు మాట్లాడినా మాటలపైనే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

 

చంద్రబాబు దగ్గర నుంచి ఛోటా మోటా నేతల వరకు ఒకరోజు బొత్స వ్యాఖ్యలపైనే మాట్లాడారు. ఇక బొత్స వ్యాఖ్యలపై చల్లారగానే కొడాలి నాని స్క్రీన్ మీదకొచ్చారు. దీంతో కొడాలి వ్యాఖ్యలపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అసలు రాజధానిలో చంద్రబాబు ఎందుకు పర్యటిస్తున్నారు? తమ హయాంలో నిర్మాణాలు ఏవేమీ జరిగాయి? అని చెప్పుకోవడంలో టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు.

 

ఇప్పటికే వైసీపీ నేతలు రాజధాని నిర్మాణంలో చంద్రబాబుని బాగా నెగిటివ్ చేశారు. కొంతవరకు నిర్మాణాలు జరిగిన అవన్నీ తాత్కాలిక భవనాలే అని, అసలు రాజధానిలో బాబు చేసిందేమి లేదని మాట్లాడుతున్నారు. అటు రైతులు కూడా ఇదే విషయాలపై బాబుపై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇవన్నీ చూసుకోకుండా మంత్రులు మాట్లాడినా రెండు మూడు మాటలనే పట్టుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. దీని వల్ల అసలు విషయం పక్కకు వెళ్ళిపోయి కొసరు విషయం హైలైట్ అవుతుంది. ఏదేమైనా వైసీపీ మంత్రుల ట్రాప్ లో టీడీపీ నేతలు బాగానే పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: