కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి మ‌ళ్లీ ఏడ్చారు. గ‌తంలో...సంకీర్ణ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న‌పుడు జ‌రిగిన పరాభ‌వాలతో క‌న్నీరు కార్చిన ఆయ‌న తాజాగా త‌న‌ కుమారుడికి ఎదురైన ప‌రిస్థితికి.... ఘోర ప‌రాజ‌యానికి ఆయ‌న చ‌లించిపోయారు. అందుకే ప‌బ్లిక్‌గానే...ఏడ్చేశారు. జేడీఎస్ ఇలాకా అయిన‌ మాండ్యలో జరిగిన పార్టీ సమావేశంలో ఇలా కుమార‌స్వామి భావోద్వేగానికి లోనయ్యారు. క‌న్నీరు కార్చారు.

 

ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్‌ మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. 
2018 లో మరణించిన సుమలత భర్త అంబరీశ్ పట్ల ప్రజల్లో ఆద‌ర‌ణ ఉంద‌ని...తన భర్త వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కోరింది. అయితే, పార్టీ టికెట్ నిరాకరించడంతో మాండ్య నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు బీజేపీ మ‌ద్ద‌తిచ్చింది. మాజీ సీఎం కుమార‌స్వామి కుమారుడైన‌ నిఖిల్ కుమార‌స్వామి తొలిసారిగా రాజ‌కీయాల్లో అడుగుపెట్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి బ‌రిలో దిగి సుమ‌ల‌త చేతిలో ఓడిపోయారు.

 

మాండ్యలో జేడీఎస్‌ కార్యకర్తలతో సమావేశమైన కుమారస్వామి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సంద‌ర్భంగానే మాండ్య‌లో త‌న కుమారుడు నిఖిల్‌గౌడ ఓట‌మిపై స్పందిస్తూ...ఆవేద‌న భ‌రిత‌మ‌య్యారు. ``నా కుమారుడు నిఖిల్ గౌడ ఎందుకు ఓడిపోయాడో నాకు తెలియదు. అస‌లు నిఖిల్‌ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకోలేదు. మాండ్య ప్రజలే అతన్ని పోటీ చేయాలన్నారు. కానీ అదే ప్రజలు నిఖిల్‌కు మద్దతుగా నిలువలేదు. అది నన్ను తీవ్రంగా బాధించింది’ అంటూ జేడీఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ముందే కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. ‘నాకు రాజకీయాలు అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవి వద్దు. కేవలం మీ ప్రేమాభిమానాలు కావాలి``అని అన్నారు. ఇదిలాఉండ‌గా, ఉప ఎన్నిక‌ల్లో నిఖిల్‌ కుమారస్వామి కె.ఆర్‌.పేటలో పోటీ చేస్తారని కర్ణాటకలో జోరుగా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: