ఎల్లోమీడియాగా ముద్రపడిన ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణను  వైసిపి సోషల్ మీడియా ఉతికి ఆరేసింది. ఒకరకంగా తాట తీసేస్తోంది అని అనటమే బాగుంటుందేమో ? ఏబిఎన్- ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రతి తప్పుడు వార్తపైనా రాధాకృష్ణ తాట తీసినట్లుగా వాయించేస్తోంది సోషల్ మీడియా విభాగం. తాజాగా ’సలహాల సర్కార్’ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తు మొదటిపేజిలో ఓ కథనం అచ్చోసి వదిలింది.

 

నిజానికి కథనమంతా పూర్తి అబద్ధాలనే చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువైపోయారంటూ ఆరోపించింది. జగన్ ప్రభుత్వంలో 19 మంది సలహాదారులున్నారని ఇందులో తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినట్లు ఎద్దేవా చేసింది. సలహాదారులు ఎక్కువ, ఇచ్చే సలహాలు తక్కువ అంటూ పెద్ద కథనాన్నే అచ్చోసింది.

 

జగన్ కు ఏ విషయంలో ఎవరు సలహాలు ఇస్తున్నారు ? జగన్ తీసుకుంటున్న సలహాలేంటో కూడా ఎవరికీ తెలియదంటూ వాపోయింది పాపం. సలహాదారులకు కూర్చోవటానికి సచివాలయంలో కనీసం చాంబర్లు కూడ లేవని బోల్డు బాధపడిపోయింది. సలహాదారుల సంఖ్యను చంద్రబాబునాయుడు హయాంతో ఓ పోలిక కూడా పెట్టింది. చంద్రబాబు హయాంలో మొత్తం మీద ఆరుగురు సలహాదారులు మాత్రమే ఉన్నారంటూ చెప్పటంతోనే ఇది తప్పుడు కథనమని తేలిపోయింది.

 

జగన్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువైపోయారని రాస్తే తప్పులేదు. కానీ చంద్రబాబు హయాంలో ఆరుగురు సలహాదారులు మాత్రమే ఉన్నారన్నదే పచ్చి అబద్ధం. టిడిపి ప్రభుత్వంలో సుమారు 100 మందికి పైగా సలహాదారులుండేవారు. వాళ్ళకు కూడా లక్షల్లోనే జీత బత్యాలు ముట్టాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ శాఖలు, ముఖ్యమంత్రి కార్యాలయం, కార్పొరేషన్లు ఇలా ఒకటేమిటి అవకాశం ఉన్న ప్రతీచోటా సలహాదారులను పెట్టుకున్నారు.

 

అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ఎవరికీ తెలియదన్నట్లుగా చంద్రబాబునాయుడు హయాంలో మొత్తం మీద ఓ అరడజను మంది సలహాదారులే ఉన్నారని చెప్పటంలో రాధాకృష్ణ ఉద్దేశ్యం అర్ధమైపోతోంది.  ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎల్లో కథనం పైనే వైసిపి సోషల్ మీడియా రాధాకృష్ణను  ఉతికి ఆరేసింది. చంద్రబాబు హయాంలో ఎంతమంది సలహాదారులున్నారనే విషయాన్ని చాలా డీటైల్డ్ గా పోస్టులు పెట్టి మరీ చాకిరేవు పెట్టింది. ఇందుకే కదా ఏబిఎన్-ఆంధ్రజ్యోతిపై ఎల్లోమీడియా అని ముద్రపడింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: