ఏపీలో బీజేపీ ఎదిగిపోవాలనుకుంటోంది. అదేం ధైర్యమో  కానీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అలా ఇలా కాకుండా రీసౌండ్ చేస్తోంది. ఏపీలో బీజేపీకి ఈ రోజుకు కూడా క్యాడర్ ఎక్కడా పెద్దగా లేదు. ఇక నాయకులు తీసుకుంటే పాతవారితో పాటు, వలస నాయకులు కొంతమంది ఉన్నారు. మరో వైపు చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. బలంగా కూడా ఉంది. 

 

తెలుగుదేశం విపక్షంలో కుదురుకోలేక నానా అవస్థలు పడుతోంది. బహుశా బీజేపీ  ధైర్యమేంటి అంటే టీడీపీ ప్లేస్ లోకి వచ్చి ఏపీలో సత్తా చాటాలని. కానీ బీజేపీ ఏపీకి ఏం చేసిందని జనాలు రిసీవ్ చేసుకుంటారని తలపండిన రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా గుండు సున్నా కొట్టింది.

 

ప్రత్యేక  ప్యాకేజి అని మూడేళ్ళ క్రితం చెప్పారు. ఇపుడు అది కూడా లేదు. మరో వైపు  విభజన హామీలు అలాగే పడి  ఉన్నాయి. ఏపీకి ప్రత్యేకంగా గ్రాంట్ల రూపంలో ఇమ్మని మొత్తుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఏపీలో బీజేపీ ఎలా ఎదుగుతుంది. బీజేపీ కొమ్ము పట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటున్న  చోటా మోటా పార్టీలకు కూడా ఆ విషయం అర్ధం కానట్లుంది.

 

ఇక ఏపీలో బీజేపీకి మాహారాష్ట్ర లాంటి దెబ్బ తీయాలంటే అన్ని పార్టీలు ఏకం కాగలరా. మరాఠాల పౌరుషం చూపించి కొట్టిన దెబ్బ ఏపీలో కూడా రిపీట్ చేయగలారా. ఎందుకు హోదా ఇవ్వలేదని అన్ని పార్టీలు ఒక్కటిగా నిలిచి కాషాయాన్ని నిలువరించగలరా. అబ్బే అలా ఎప్పటికీ  చేయలేరు. 

 

మహారాష్ట్ర రాజకీయాలు తీసుకుంటే అక్కడ చిన్నా చితకా పార్టీలు సైతం బీజేపీ వైపు వెళ్ళమని గట్టిగా నిలబడ్డాయి. మరి ఇక్కడ చూస్తే సీన్ మొత్తం రివర్స్ కదా. కాషాయం కొంగు కోసం తహతహలాడిపోతున్న వారే ఉన్నారుగా. ఉత్తరాది, దక్షిణాది అంటూ గర్జించిన  ఒక నాయకుడు ఇపుడు బీజేపీ గురించి పెద్ద కబుర్లు చెబుతున్నారు. బీజేపీలో శక్తివంతమైన నాయకులు ఉన్నారని కూడా ఆయన కమలం నాయకులకంటే తెగపొగుడుతున్నారు.

 

మరి ఆయన ప్రత్యేక హోదాని ఎపుడో మరచిపోయిఉండాలి. లేదా తన రాజకీయం కోసం యూ టర్న్ తీసుకుని అయినా ఉండాలి. ఇక బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకులు సైతం పాహిమాం అంటూ పాదాక్రాంతం అవుతూంటే ఏపీలో బీజేపీ బోర విడుచుకుని రాకుండా ఏం చేస్తుంది మరి, ఏపీ ప్రజలు కోరుకోని విభజనను కాంగ్రెస్ అడ్డంగా చేస్తే దానికి మద్దతు ఇచ్చి ప్రత్యేక  హోదా తెస్తామని నాడు భీషన ప్రతినలు చేసిన వారు ఇపుడు సైడ్ అయిపోయారు. 

 


ఢిల్లీ కంటే అద్భుత రాజధాని కడతామని చెప్పిన వారు కూడా సైలెంట్ అయిపోయారు. ఏపీ ఇపుడు దారుణమైన ఆర్ధిక ఇబ్బందులో ఉంది. అయినా నేతాశ్రీలకు పట్టడం లేదు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి  లేవని గొంతులు ఏపీలో రాజకీయం మాత్రం చేస్తాయి. అందువల్లనే ఏపీలో బీజేపీ దర్జా ఒలకబోస్తోందంటున్నారు మేధావులు. ప్రత్యేక హోదా పై మళ్ళీ సమరశంఖం పూరిస్తామని హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అంటున్నారు. నిజంగా హోదా ఉద్యమం మళ్ళీ  బయలుదేరితే అపుడు అన్ని రాజకీయ పార్టీల రంగు, రుచి అన్నీ ఒక్కసారిగా బయటపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: