అవినీతి ఉచ్చులో చిక్కుకుని ఒక ప్రాణం పోయినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు వస్తలేదు. అసలు అవినీతికి కొమ్ము కాస్తూ భద్రంగా పెంచుకుంటున్నారు. ఒక వైపు దగాపడుతున్న ప్రజలు ఉగ్రరూపమెత్తి తమ కోపాన్ని కక్షగా మార్చుకొని ప్రాణాలు తీసెయ్యాలి అన్నంతగా ఊగిపోతుంటే ఎక్కడో ఒకచోట ఇలాంటి లంచగొండులు అవతారమెత్తుతున్నారు. సమాజంలో కష్టపడేవారి రక్తాన్ని జలగలా పీడించుకుని తినగా వచ్చే లంచం డబ్బు ఏం సుఖాన్ని ఇస్తుందో అర్ధం కావడం లేదు. ఆ సొమ్ముతో తిన్న కూడు ఎలా అరుగుతుందో తెలియడం లేదు.

 

 

నీతిని చెత్తబుట్టలో చిత్తుకాగితంలా పడేసి అవినీతి ఉయ్యాలలో ఊగుతున్న లంచగొండులను ఎంతంగా మట్టిలో కలిపిన బుద్దిరాదు. అనవసరంగా ఇలాంటి పనులు చేసి మంచివారు తమ జీవితాల్లో నేరస్దులు అనే ముద్ర వేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయని ఎన్ని విమర్శలొచ్చినా అధికారులు, సిబ్బంది తీరులో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. చేయి తడపనిదే ఏ పనీ కాని దుస్దితి నెలకొంది.. ఇక మొన్నటికి మొన్న భూ సమస్య పరిష్కరించకుండా వేధింపులకు గురిచేస్తోందని తహసీల్దార్‌ను సజీవ దహనం చేసిన ఘటన తెలిసిందే.

 

 

ఆ ఘటన తరువాత చాలా చోట్ల రైతులు, సామాన్యులు పెట్రోల్ డబ్బాలు.. పురుగు మందుల డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. కొందరైతే ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. మరోవైపు ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ ముందే లంచం డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో తన్నుకున్న ఘటన కర్నూలులో జరిగింది. ఇక తహసీల్దారే ఇద్దరికీ రాజీ కుదర్చడం విశేషం. ఇదిలా ఉండగా అదే జిల్లా గూడూరు ఎమ్మార్వో హసీనాబీ లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన విషయం ఏసీబీకి తెలియడంతో ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.

 

 

ఇకపోతే లంచాల వేధింపులతో విసుగుచెందిన ప్రజలు ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నా  సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇకపోతే  ఇలాగే ప్రవర్తించిన మరో వీఆర్వో భాగోతం నెల్లూరు జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామ వీఆర్వో ఉషా లావణ్య పూర్ణిమ 3 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

 

 

నెల్లూరుకు చెందిన పాకం లోకేష్‌కు చెందిన భూమి వివరాలను ఆన్‌లైన్ అడంగల్ లో నమోదు చేసి ఈ-పాస్‌బుక్ ఇచ్చేందుకు వీఆర్వో లావణ్య మూడు వేల రూపాయలు డిమాండ్ చేశారు. లంచం చెల్లించడం ఇష్టం లేని లోకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్వో లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే సమాజం మారదు. సమాజంలోని మనుషులు మారరు అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: