తెలంగాణలో 52 రోజులు పాటు ఆర్టీసీ కార్మికులు చేసిన  సమ్మె  గురించి కాంగ్రెస్ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి  పార్లమెంట్ లో ప్రస్తావించారు  .  రాష్ట్ర  ప్రభుత్వం కార్మికులను ప్రయోజనాల గురించి  అసలు పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు .  కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికుల  సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1950 మోటార్ వెహికల్ చట్టం సెక్షన్  ఏ  ప్రకారం ఏపీఎస్ ఆర్టీసి ఏర్పడిందని, ఈ చట్టం ప్రకారం తెలంగాణ కు సంబంధించి 10, 460 బస్సులు, 49, 000 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారని రేవంత్ పార్లమెంట్ కు వివరించారు  .

 

 గత 52 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా, 30 మందికి పైగా కార్మికులు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు .   రాష్ట్ర ప్రభుత్వం , ఆర్టీసీ కార్మికులతో   ఇప్పటి వరకు  చర్చలు జరపలేదని, అంతే కాదు సమ్మె విరమించి  విధుల్లో  తిరిగి చేరుతామన్నా,  రాష్ట్ర  ప్రభుత్వం కార్మికుల గోడు పట్టించుకునే స్థితిలో లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.  కరీంనగర్ కు చెందిన బాబు అనే ఆర్టీసి కార్మికుడు చనిపోతే, అంత్యక్రియల సందర్భంగా జరిగిన గొడవలో ఎంపి బండి సంజయ్ పై రాష్ట్ర పోలీసులు దాడి చేశారని, సంజయ్ ప్రివిలైజ్ మోషన్ కూడా మూవ్ చేశారని, బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా  రేవంత్ కోరారు .

 

 2014 నుండి ఇప్పటివరకు కార్మికుల పీఫ్ డబ్బులను కూడా తినేశారని, ఇది క్రిమినల్ చర్య అని వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తోందన్న అయన, ఆర్టీసీ లో   33శాతం కేంద్రం వాటా కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగిన  చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: