ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు. కాపు మహిళలకు పాదయాత్రలో చెప్పిన విధంగా ఐదేళ్లలో రూ. 75 వేల రూపాయల లబ్ది కలిగించనున్నారు. ఇందుకు కేబినెట్ ఆమోదం చెప్పేసింది. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అనే పథకం అమలు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉప కులాలకు చెందిన ఆడపడుచులకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల చొప్పున చెల్లిస్తారు. ఇలా ఐదేళ్లపాటు చెల్లిస్తారు. అంటే.. వారికి ఐదేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసాయం అందిస్తారన్నమాట.

 

అయితే ఈ వరం అందుకోవాలంటే వారి వయస్సు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కాపు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎన్నికల హామీల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకంగా పేరు పెట్టారు. దీని కోసం రూ. 1101 కోట్లు కేటాయించాం. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వాటిటని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు.

 

అయితే కాపు మహిళలకు 45 నిండినవారికి ఏకంగా ఏటా 15 వేలు... ఐదేళ్లలో 75 వేలు ఇవ్వాలని నిర్ణయించడం పై విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. కేవలం కాపు మహిళలకు మాత్రమే ఇలా వరాలు ప్రకటించడం మిగిలిన సామాజిక వర్గాల నుంచి అసంతృప్తి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే.. జగన్ ఈ విషయాన్ని ఎన్నికల ముందే ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు.. కాబట్టి వైసీపీ నాయకులు దాన్ని బాగానే సమర్థించుకునే అవకాశం కనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: