లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జనవరిలో మునిసిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టుకు ఇదే విషయాన్ని ఏపీ సర్కార్ చెప్పడంతో ఇక ఎన్నికలు ఎంతో దూరంలో లేవు అని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఏపీలో మరో మారు రాజకీయ యుధ్ధం మొదలైపోతుందన్నమాట. ఈ సంక్రాంత్రికి పందెం కోళ్ళతో పండుగ వస్తుంది. ఆ తరువాత అసలైన‌ కోడి పుంజులు బరిలోకి దిగుతాయని అంటున్నారు.

 

లోకల్ బాడీ ఎన్నికల్లో విపక్షాలను కబడ్డీ ఆడించాలని జగన్ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఇపుడు వెల్లువలా స్కీములు ప్రకటిస్తున్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం దాదాపుగా ఏడువేల కోట్ల రూపాయల స్కీములకు జగన్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఇవన్నీ కూడా తొందరలోనే అమల్లోకి వస్తాయి.

 

ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు జగన్ ప్రకటించి ఉన్నారు. వీటిని గ్రౌండ్ చేసేందుకు డిసెంబర్ నెలాఖరుకు గడువు విధించారు. అమ్మ ఒడి పధకం మొదట జనవరి 26 అనుకున్నారు. కానీ ఎన్నికలు ద్రుష్టిలో ఉంచుకునే దాన్ని జనవరి 9వ తేదీకి మార్పు చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ తన మంత్రులను పిలిచి లోకల్ బాడీ ఎన్నికలు చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఎక్కడా తేడా రాకూడదని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.

 

ఇంచార్జి మంత్రుల మీద పెద్ద బాధ్యతలే మోపారు. దాంతో వారు ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో చమటోడ్చాల్సిందే. ఇక తాను కూడా జనవరి తరువాత జిల్లాల టూర్లు వేస్తాన‌ని జగన్ అంటున్నారు. మొత్తానికి విపక్షానికి ఎక్కడా చాన్స్ ఇవ్వరాదని జగన్ గట్టిగానే డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికే గట్టి దెబ్బ సార్వత్రిక ఎన్నికల్లో కొట్టామని దాన్ని రిపీట్ చేస్తే ప్రతిపక్షాలకు వారు సీటూ, చోటూ తెలిసివస్తాయని  జగన్ భావిస్తున్నారుట.

 

తన మీద నిందలేసి ఘోరంగా మాట్లాడుతున్న విపక్షాలకు లోకల్ బాడీ ఎన్నికలతోనే గట్టి జవాబు జగన్ ఇవ్వాలనుకుంటున్నారుట. ఈ ఎన్నికల తరువాత తిరిగి జరగేవి సార్వత్రిక ఎన్నికలే కావడంతో వీటిని ప్రతిష్టాత్మ‌కంగా తీసుకోవాలని జగన్ పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు. మొత్తానికి లోకల్ బాడీతో కబడ్డీ ఆడేయాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: