తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఎందుకంటే  52 రోజులపాటు కొనసాగిన సమ్మె వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, 30 మందికిపైగా కార్మికుల మృతి, తాత్కాలిక సిబ్బంది బస్సులు నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం వంటి పరిణామాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటం, పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

 

ఈ దశలో దేశంలో మెరుగైన ప్రజా రవాణా సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు గాను గురు, శుక్రవారాల్లో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీకి కొత్త రూపు ఇవ్వనుంది. ఇకపోతే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నందున వారి భవితవ్యాన్ని తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్న అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతుండటంతో రెండు రోజులపాటైనా సరే మంత్రివర్గ భేటీ నిర్వహించి ఈ విషయాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

 

 

ఇదేకాకుండా రవాణ రంగంలోకి ప్రైవేటు బస్సులు  దిగితే ఆర్టీసీ సగానికి సగం కుంచించుకుపోనుంది. ప్రస్తుతం ఉన్న రూట్ల ప్రకారం దాని పరిధిలో 5,300 బస్సులు మాత్రమే మిగులుతాయి. 49,700 మంది ప్రస్తుత కార్మికుల్లో కనీసం 20 వేల మంది ‘అదనం’గా మిగిలిపోతారు. వారిని కచ్చితంగా వీఆర్‌ఎస్‌ ద్వారానో, సీఆర్‌ఎస్‌ ద్వారానో తప్పించాల్సి ఉంటుంది.

 

 

దీని పరిధిలోకి 50 ఏళ్లు పైబడిన వారిని తెచ్చే అవకాశం ఉంది. దీన్ని అమలు చేయాలంటే కనీసం రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు లెక్కలేశారు. ఇంత మొత్తం భరించడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారనుంది. అయితే వచ్చే నాలుగైదేళ్లలో భారీ సంఖ్యలో కార్మికులు రిటైర్‌ అవుతుండటంతో ఒకవేళ అప్పటివరకు ఈ ప్రక్రియ ఆగితే ప్రభుత్వానికి వీఆర్‌ఎస్‌ బాధ ఉండదని ఆలోచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: