చంద్రబాబునాయుడు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుదామని అనుకున్నారు. తీరా జిల్లాకు వెళ్ళిన తర్వాత నేతలు, కార్యకర్తలే  రివర్స్ పంచ్ లు ఇవ్వటంతో చంద్రబాబు బిత్తరపోయారు.  మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది సీట్లు వైసిపి క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

మొదటినుండి కూడా ఈ జిల్లా వైఎస్ కుటుంబం అడ్డాగా పాపులరైంది. ఎన్టీయార్ ఉన్న రోజుల్లో కూడా మెజారిటి సీట్లలో గెలవటానికి చాలా అవస్తలు పడేది. అలాంటిది పార్టీ పగ్గాలు చంద్రబాబు లాక్కున్న తర్వాత మెజారిటి అన్న ముచ్చటే లేదు. వైఎస్ దివంగతులైన తర్వాత జరిగిన పరిణామాలతో మొత్తం జిల్లా అంతా జగన్ వెంటే నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసిపి మెజారిటి సీట్లు తెచ్చుకుంది.

 

ఇలాంటి జిల్లాలో జగన్ సిఎం అయిన తర్వాత చంద్రబాబు మొదటిసారి అడుగుపెట్టారు. ప్రతి విషయంలోను సిఎంను టార్గెట్ చేసుకుని బురద చల్లుదామని ప్లాన్ వేసుకున్నారు. తీరా నియోజకవర్గాల సమీక్షలు మొదలయ్యే సరికి చాలామంది తననే తప్పు పట్టడంతో ఏమి చేయాలో అర్ధం కాలేదు. పార్టీ ఇంతటి ధీనస్ధితిలో పడిపోవటానికి కారణం చంద్రబాబే అంటే ఆయన మొహం మీదే కొందరు చెప్పేశారు. మధ్యలో చంద్రబాబు వారించాలని చూసినా ’ఇపుడు కూడా మమ్మల్ని మాట్లాడనీయకపోతే ఇంకెపుడు మాట్లాడుతామ’ని అడగటంతో ఏమీ చేయలేకపోయారు.

 

జనబలం లేని వాళ్ళని, వ్యాపారస్తులను నెత్తిన పెట్టుకుని జిల్లాలో పెత్తనం ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటుందని సిఎం రమేష్, ఆదినారాయణరెడ్డిల పేర్లు చెప్పి మరీ చంద్రబాబును వాయించేశారు. జిల్లాలోని మొత్తం పది సీట్లలోను పార్టీ ఓడిపోవటానికి చంద్రబాబు ఫెయిల్యూరే ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. అధికారంలో ఉన్నపుడు చాలామంది నేతలను, కార్యకర్తలను ఎందుకు దూరంగా పెట్టారంటూ నిలదీశారు.  నేతలు, కార్యకర్తల ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలో తెలీక చివరకు పర్యటనను ఎలాగో పూర్తి చేసుకుని బయటపడ్డారు చంద్రబాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: