ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు పరిచయం లేని పేరు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో ఢీ అంటే ఢీ అని బీజేపీతో 30 ఏళ్ళ సహవాసానికి తెరదించి ఎన్సీపీ మరియు కాంగ్రెస్ తో జత కట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం 6.40 నిముషాలకు ముంబై లోని శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పదవి ఆయనకు ఆషామాషీగా రాలేదు జీవితంలో ఎన్నో అవాంతరాలు దాటుకుని ఈ స్థాయికి వచ్చారు ఉద్ధవ్.

 

ఠాక్రే కుటుంబం నుంచి మొదటి సీఎం ఉద్ధవ్ ఠాక్రేనే

 

మహారాష్ట్ర ప్రజల హక్కుల పోరాట సాధనకై 1966 వ సంవత్సరంలో బాల్ ఠాక్రే శివసేన పార్టీ ని స్థాపించారు కానీ ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు మరియు ఏ పదవిని ఆశించలేదు. తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు నడిచాడు.

 

ఉద్ధవ్ ఠాక్రే మంచి ఫోటోగ్రాఫర్ 

 

బాల్ ఠాక్రే కు చిన్న కొడుకైన ఉద్ధవ్ ఠాక్రే కు చిన్నప్పటినుండి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది ఈ ఆసక్తితోనే ఫోటోగ్రఫీలో మంచి నైపుణ్యం సాధించాడు ఉద్ధవ్. తన రెండు పదుల వయసులో ఉన్నప్పుడు ఉద్ధవ్ మహారాష్ట్రలోని 28 కోటల ఫోటోలు గాలిలో ఎగురుతూ (విమానంలో ప్రయాణిస్తూ) తీసాడు ఏరియల్ ఫోటోగ్రఫీ అత్యంత కష్టంతో కూడుకున్నది అయినా ఉద్ధవ్ పట్టు విడువకుండా 4500 ఫోటోలను తన కెమెరాలో బంధించాడు. ప్రభుత్వం కూడా ఉద్ధవ్ ఫోటోగ్రఫీని మెచ్చుకోవడం విశేషం. మంచి ఫోటోగ్రాఫర్ గా స్థిరపడదాం అనుకున్నాడు ఉద్ధవ్.

 

ఠాక్రే జీవితంలో ఊహించని మలుపులు 

 

ఇలా సాఫీగా సాగిపోతున్న ఉద్ధవ్ జీవితంలో అనుకోని మలుపు, 2002 వ సంవత్సరంలో మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీని నడిపించాల్సిందిగా పార్టీ నుంచి పిలుపు వచ్చింది. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ చాలా ఎక్కువ సీట్లు గెలవడంతో ఉద్ధవ్ ఠాక్రే పేరు మహారాష్ట్రలో మారుమ్రోగింది. ఇక 2004 వ సంవత్సరంలో పార్టీ బాధ్యతలను తండ్రి బాల్ ఠాక్రే,  ఉద్ధవ్ ఠాక్రే కు అప్పజెప్పారు. పెద్ద కొడుకు రాజ్ ఠాక్రే ఉండగా చిన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ను పార్టీ అధినేతగా ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఈ అనుకోని మలుపుతో తండ్రి ఆదేశాల మేరకు పార్టీ బాధ్యతలు చేపట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వచ్చారు. 2014 వ సంవత్సరంలో బీజేపీ తో పొత్తుపెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం అయ్యారు.

 

ఇక 2019 లో తన కుమారుడు ఆదిత్య ఠాక్రే కు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆదిత్య ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న మొట్టమొదటి ఠాక్రే కుటుంబ సభ్యుడిగా రికార్డు సృష్టించారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే, ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి గా రెకార్డులకెక్కనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: