గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీడీ, బీజేపీ ఎంత తిట్టుకున్నాయో జనం అప్పుడే మరిచిపోలేదు. ఇక బీజేపీ నేతలు మోడీ, అమిత్ షాలనైతే టీడీపీ నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఎన్నికల ప్రచారాల్లో ఏకంగా వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. కానీ ఏమైంది. గత ఎన్నికల్లో టీడీపీ తల బొప్పి కట్టింది. మోడీ మళ్లీ రాజయ్యాడు.

 

ఏపీలో టీడీపీ అధికారం చేజారింది. ప్రత్యర్థి జగన్ ఎవరికీ అందనంత విజయం అందుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఆత్మరక్షణ దోరణిలో పడింది. మళ్లీ బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. అందులో భాగంగానే చీటికీ మాటికీ బీజేపీనీ,మోడీని పొగుడుతున్నారు చంద్రబాబు. అంతే కాదు.. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఎంపీలను అమిత్ షా వద్దకు పంపించారు.

 

ఎన్డీయేతో తెగదెంపులు చేసుకొన్న తర్వాత తొలిసారిగా టీడీపీ ఎంపీలు బుధవారం బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌, తోటసీతారామలక్ష్మి పాల్గొన్నారు. కారణం ఏంటయ్యా అంటే.. భారతదేశ చిత్రపటంలో అమరావతిని చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారట.

 

ఇదే అంశంపై చంద్రబాబునాయుడు రాసిన లేఖను ఆయనకు అందజేశారట. అయితే ఈ సందర్భంగా ఏపీలో వైసీపీ పాలనపై ఫిర్యాదు కూడా చేశారట. ఆంధ్రప్రదేశ్‌లో గూండా రాజ్యం నడుస్తోందని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని వారు అమిత్‌షా దృష్టికి తెచ్చారట. ఈ సమయంలో అదంతా నాకు తెలుసు అంటూ అమిత్ షా అన్నారట.

 

ఇవే కాదు.. ఇంకా చాలా సమస్యలున్నాయి.. మళ్లీ అపాయింట్‌మెంట్‌ తీసుకొని వస్తామని టీడీపీ నేతలు అడిగారట. అప్పుడు అమిత్ షా.. అబ్బే మీకు అపాయిట్ మెంట్ ఎందుకు .. మీరు ఎప్పుడైనా స్వేచ్ఛగా రావొచ్చు అని అన్నారట. అమిత్‌ షా ఆ మాట అనేసరికి.. టీడీపీ ఎంపీలు తెగ సంబరపడిపోయారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: