అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం వల్ల జరిగే అనర్దాలకు కొదువే లేదు. పచ్చని సంసారాలనుండి, మంచి మిత్రుల వరకు దీని బారిన పడి ఎందరో మాడి మసైపోయారు. అనుమానం ముదిరితే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. ఇలాంటి అనుమానమే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.  ప్రైవేటు కంపెనీలో  సేల్స్‌పర్సన్స్‌గా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో సంతృప్తిగా, చిలక గోరింకల్లా బ్రతుకుతున్న భార్య, భర్తల కాపురంలోకి అనుమతి లేకుండా వచ్చిన అనుమానం కలహాలకు దారి తీసింది.

 

 

దీని ఫలితం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగి హత్యకు పురిగొల్పింది. నరసరావుపేట డీఎస్పీ ఎం.వీరారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం. పోట్లూరుకు చెందిన సిద్దం చిన నాసరయ్యకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకికి చెందిన గొర్రపాటి సువార్త (19)తో ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. చక్కగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం మొదలైంది. ఇలా భార్యపై అనుమానంతో చిన నాసరయ్య రోజు వేధిస్తుండగా తట్టుకోలేక ఆమె పుట్టింటిలో బిడ్డను వదిలి సత్తెనపల్లిలోని మహిళా వసతి గృహంలో ఉంటోంది.

 

 

ఈ దశలో ఆమె పై కక్ష పెంచుకున్న ఆమె భర్త నెల రోజుల తర్వాత ఆమెను కలసి నమ్మకంగా మాట్లాడి ఆమెను నమ్మించి అతని ఇంటికి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన మూడో రోజు రాత్రి తన సోదరుడు చిన్న వెంకయ్యతో కలసి గొంతు నులిమి చంపి ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకుని ఊరి చివర్లో ఉన్న శ్మశానంలో పెట్రోలు పోసి తగలబెట్టి వెళ్లిపోయారు. ఇకపోతే గుర్తు తెలియని మహిళను చంపి తగల బెట్టారన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి గ్రామీణ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తూ ప్రారంభించారు..

 

 

ఇందులో భాగంగా హతురాలి కాలిమెట్టలు, ఉంగరం ఫొటోలను చుట్టుపక్కల గ్రామాల్లో చూపించారు. పెట్రోలు బంకులో ఉన్న సీసీ పుటేజీలు పరిశీలించగా అదే రోజు చిన్న వెంకయ్య మూడు బాటిళ్ల పెట్రోలు కొన్నట్లు గుర్తించారు. ఈ ఘటన పై నిఘా పెట్టి పరిశీలించగా హతురాలు సంఘటన జరిగిన రోజు నుంచి కనిపించడం లేదని చుట్టుపక్కలవారు చెప్పడంతో అనుమానించి గ్రామీణ సీఐ సుబ్బారావు, ఎస్సై కె.స్వర్ణలత నరసరావుపేట లాడ్జీలో ఉన్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని పేర్కొన్నారు. చూసారా ఆనందంగా జీవిస్తూ, కాపురం చేసుకుంటున్న వీరి మధ్యలోకి వచ్చిన అనుమానం మూడు జీవితాలను నాశనం చేసింది. అందుకే ఎట్టి పరిస్దితులో విచక్షణ కోల్పోకూడదని మన పురాణాలు చెబుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: