ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు, సంక్లిష్ట స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చూపే నాయ‌క‌త్వానికి మారుపేరుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. త్రిపుల్ త‌లాక్‌, అయోధ్య‌, జ‌మ్మూక‌శ్మీర్ వంటి సుదీర్ఘ అంశాల‌ను ఆయ‌న ప‌రిష్కరించారు. అయితే, ఆయ‌న బ‌ల‌మైన వ్య‌క్తి అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముందే తెలుసట‌. ప్ర‌ధాని కాక‌ముందే..ఈ విష‌యం ఆయ‌న‌తో చెప్పార‌ట‌. ఈ మేర‌కు ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దేశంలో ఉత్తర, దక్షిణ భార‌తం అనే వేర్పాటువాదాలు వస్తాయని, వీటిపై దృష్టి సారించాలని సూచించాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``మీలాంటి బలమైన వ్యక్తులు ఉన్నంతకాలం ఫర్వాలేదు కానీనీ బలహీనమైన వ్యక్తులు పాలనలోకి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ అనే వేర్పాటువాదాలు వస్తాయి... వీటిపై దృష్టి సారించాలి అని 2014లో అప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియచేశాను`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

నాయ‌క‌త్వ స‌మ‌స్య‌తోనే ప్రాంతీయ‌వాదం తెర‌మీద‌కు వ‌స్తుంద‌ని ప‌వ‌న్ విశ్లేషించారు.  ``ప్రాంతీయంగా సంస్కృతి, భాషల ప్రాముఖ్యతను, విశిష్టతనీ అర్థం చేసుకొనే నాయకత్వాలు... ప్రజల్లో అంతరాలను తగ్గించే నాయకత్వాలు లేనప్పుడూ, కేవలం తమ రాజకీయ ఉనికి కోసం  పని చేసే నాయకులూ ఉంటే చాలా  వేర్పాటువాదాలకు బలమైన బీజాలు ఏర్పడతాయి. ఇవి తెలిసి చేసినా, తెలియక  చేసినప్పటికీ అవి దేశ సమగ్రతకు ముప్పుగా మారతాయి. అందువల్ల ప్రాంతీయతను విస్మరించని జాతీయ నాయకులూ ఎక్కువ మంది కావాలి. అలాగే ప్రాంతీయ స్థాయి నాయకులూ  జాతీయ భావాలను, జాతీయ సమగ్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశపు మూలాలైన మన భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతీయ నాయకులకు మన సంస్కృతి, భాషలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. తెలిసీ తెలియకుండా మన భాషకు, సంస్కృతికీ నష్టం కలిగిస్తే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. `` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా మాతృ భాష గురించి సైతం ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. ``మాతృభాష మూలాలను రేపటి తరానికి తెలీకుండా చేయడం ద్వారా దేశంలో భాష, సంస్కృతుల విశిష్టతకీ, సనాతన ధర్మ పవిత్రతకీ నష్టం కలిగిస్తున్నారు. ఏ సంస్కృతి ఏ సంప్రదాయాలు, ఏ భాష  పునాదులపై దేశం నిలబడిందో ఆ సమగ్రతను ఉత్తర, దక్షిణ వైరుధ్యాలతో విచ్చిన్నం చేస్తారు. కశ్మీర్ ను దేశంలో అంతర్భాగం చేసిన తరుణంలో దేశ భాష సంస్కృతులను దెబ్బ తీసి, సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారని విశ్రాంత డీజీపీ అరవింద రావు చెప్పిన విషయంపై ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా స్పందించాల్సి ఉంది.`` అని ప‌వ‌న్ కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: