తెలంగాణ రాష్ట్రంలో కీల‌క‌మైన ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో...ఆర్టీసీ యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా సర్కారు దిగిరాలేదు. చివరికి కార్మికులే సమ్మె విరమించి, డ్యూటీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయినా ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ మాత్రం.. హైకోర్టు ఆదేశాల మేరకు లేబర్ కోర్టు నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా ఆగాల్సిందేనని ప్రకటించారు. అయితే ఇంతకాలం కొనసాగిన అనిశ్చితికి కేబినెట్ భేటీలో తెరపడుతుందా, కార్మికులపై ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. దీంతో ఈ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశంపై అంద‌రి చూపు ప‌డింది. ఇందులో ఏ నిర్ణయం వెలువడుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

 

రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కేబినెట్ భేటీ కోసం ప్రధాన ఎజెండాగా ఆర్టీసీలోని వివిధ అంశాలను అధికారులు సిద్ధం చేశారు. కార్మికుల విషయంలో ఏం చేయాలన్న అంశంతోపాటు ప్రైవేటు బస్సుల పాలసీ, రూట్ల డీనోటిఫై చేయడంపై భేటీలో చర్చించనున్నారు. ఇదే స‌మ‌యంలో...కార్మికులు పనిచేసిన సెప్టెంబర్‌  నెలకు సంబంధించిన జీతాలు ఇవ్వబోమని ఆర్టీసీ మేనేజ్​మెంట్​ హైకోర్టుకు చెప్పింది. ఈ విషయంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పేమెంట్​ ఆఫ్​ వేజెస్​ యాక్ట్​ ప్రకారం ఒక రోజు డ్యూటీకి డుమ్మా కొడితే ఎనిమిది రోజుల జీతం కట్‌ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. కార్మికులు చెప్పాపెట్టకుండా డ్యూటీలకు గైర్హాజరు అయ్యారని, వేజెస్​ యాక్ట్​ ప్రకారం వారికివ్వాల్సిన జీతాన్ని కట్​ చేసుకునేందుకు మేనేజ్​మెంట్​కు అధికారం ఉంటుందని పేర్కొంది.

 

 

ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి హనుమంతు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు సింగిల్​ జడ్జి జస్టిస్​ అభినంద్​కుమార్​ షావిలి బుధవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున అడిషనల్​ అడ్వొకేట్​ జనరల్​ జె.రామచందర్​రావు వాదనలు వినిపించారు. కార్మికులకు సెప్టెంబర్‌‌‌‌ నెల జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్​ తరఫు లాయర్​ చిక్కుడు ప్రభాకర్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వకపోవడం వెట్టి చాకిరీ చేయించుకున్నట్టు అవుతుందని, తక్షణమే జీతాలు చెల్లించేలా ఆర్టీసీని ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. సమ్మె చేసిన కాలానికి జీతాలు కోరడం లేదని, కష్టపడి పనిచేసి, శ్రమశక్తిని ధారపోసిన కాలానికే జీతం చెల్లించాలని కోరుతున్నామని వివరించారు. కార్మికులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి విచారణను వచ్చే బుధవారానికి (డిసెంబర్​4వ తేదీకి) వాయిదావేశారు. కాగా, ఆర్టీసీపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు ముందే...కార్మికుల‌కు కేసీఆర్ ఇలా షాకిచ్చార‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: