ఆయన దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఆయన దాయాది పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పిన నాయకుడు. దేశ విదేశాలో కూడా మోడీ కత్తికి ఎదురులేదు. మోడీ ఒక కోణంలో మొండిగా కనిపిస్తారు. అది ప్రత్యర్ధులకు నిలువెల్లా  కలవరింపే. మోడీతో పెట్టుకోవాలని  ఏ రాజకీయ నాయకుడూ కూడా అనుకోరు. పెట్టుకుంటే ఇక నిద్ర లేని రాత్రులే మిగులుతాయి అని తెలుసు. అటువంటి మోడీ సంగతి తెలిసి తెలిసి పెట్టుకుంటున్నారా...

 

మోడీకే వెన్నుపోటు పొడిచిన ఆ నాయకుడి కధ ఇపుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడని నిర్ణయించుకుంది. ఒక విధంగా రాజకీయంగా నైతిక నిష్టకు పెద్ద పీట వేసింది. అందుకే  మాకు బలం లేదని గవర్నర్ కి ఈ నెల 10న చెప్పేసింది. ఆ తరువాత ఎవరికీ బలం లేకపోవడంతో రాష్ట్రపతిపాలన కూడా విధించారు.

 

ఇదిలా ఉండగా   రైతు సమస్యల పేరు మీద ఈ మధ్య ఢిల్లిలో  ప్రధాని మోడీని కలసిన మరాఠా నాయకుడు శరద్ పవార్  మహా రాజకీయాలపైన లోపాయికారీ చర్చలు జరిపారని టాక్. అందులో బాగంగానే ఎన్సీపీ మద్దతు బీజేపీకి ఉంటుందని ఆ పార్టీ భావించింది. అక్కడే మోడీకి ఒక ఖచ్చిత‌మైన హామీ కూడా దక్కిందట. సరే ఆ తరువాత ఎన్సీపీ మీటింగులో కూడా శివసేన కంటే బీజేపీతోనే ఎన్సీపీ  కలసి వెళ్తే బాగుంటుందని అజిత్ పవార్, ప్రపుల్ పటేల్ వంటి నేతలు ప్రతిపాదించినపుడు కూడా శరద్ పవార్ సరేనని అన్నారట.

 

ఆ తరువాతే  అజిత్ పవార్ సీక్రెట్ గా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇవ్వడం జరిగిందట. దాంతో డేరింగ్ స్టెప్ వేసి బీజేపీ మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే మొదట సరేనన్న శరద్ పవార్ తరువాత మొత్తానికి అడ్డం తిరగడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. మోడీ తన మీద ఎంఫొర్స్మెంట్ శాఖ ద్వారా  కేసులు పెట్టించారన్న ఆగ్రహంతో ఉన్న శరద్ పవార్ ఈ విధంగా వెన్నుపోటు పొడిచారని ముంబై, ఢిల్లీ రాజకీయ వర్గాల కధనాలు.

 

అందుకే శరద్ పవార్ ని కూడా కాంగ్రెస్ పెద్దలు మొదట నమ్మలేదు. ఆయన మోడీతో మీటింగ్ తరువాతే బీజేపీకి పవర్ దక్కిందని కూడా వారు అంచనా వేశారు. ఇక్కడ పవార్ తన రాజకీయ వ్యూహంతో బీజేపీ పరువు నడిబజార్లో తీసేశారు. ఇపుడు బీజేపీ మొత్తం దేశం ద్రుష్టిలో కుర్చీ కోసం దేనికైనా బరితెగించే పార్టీగా మారిపోయింది. మోడీ ప్రతిష్ట కూడా మసకబారింది.

 


దీని వెనకాల శరద్ పవార్ రాజకీయ చాణక్యం పూర్తిగా ఉందని తెలిసిన బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో కుతకుతలాడుతున్నాయట. ఇపుడు మోడీకి వెన్నుపోటు పొడిచిన నేతగా శరద్ పవర్ ఉన్నారు. మరి పవార్  మీద మోడీ రివేంజి ఎపుడు, ఏ విధంగా ఉంటుందన్నది రాజకీయ వెండితెర మీద చూడాల్సిందేనని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: