ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మార్పు రగడ రగులుతున్న  ఉన్న విషయం తెలిసిందే. రాజధాని మార్పు చేస్తామని రాజధాని నిర్మాణం సక్రమంగా జరగలేదని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది... మార్పు నిర్ణయం సరైనది కాదంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో పర్యటించేందుకు నిర్ణయించారు. టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రాజధానిలో పర్యటించి టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయి అని  పరిశీలించానున్నారు. అలాగే రాజధాని అమరావతి లోని రైతులు,  స్థానిక నేతలతో  సమావేశం కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి అమరావతిలో పర్యటిస్తుండటం  ఆసక్తిని రేపుతోంది. 

 

 

 

 అయితే అమరావతి పర్యటనకు బయలుదేరే ముందు చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేసారు. రాజధాని అమరావతి పట్ల 5కోట్ల ఆంధ్రులను ఉన్న భావోద్వేగాలు వైసీపీ పార్టీకి తెలుసని... అందుకే రాజధాని అమరావతి పై దుష్ప్రచారం చేస్తూ క్రమక్రమంగా చంపాలని వైసిపి నీచమైన కుట్రలకు తెరతీస్తున్నది  అంటూ విమర్శించారు. కుట్రను బయటపెట్టేందుకే  అమరావతి పర్యటనకు వెళుతున్న అంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా రాజధాని అమరావతి పై ఓ ట్విట్  పెట్టారు. వేలాది మంది రైతుల త్యాగ  ఫలితమే రాష్ట్ర రాజధాని అమరావతి అని... రాజధాని నిర్మాణం కోసం రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు నారా లోకేష్.

 

 

 

 ఇదిలా ఉండగా చంద్రబాబు పర్యటన రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ఫ్లెక్సీ లను  ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు పర్యటన చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అంటూ రైతుల దగ్గర్నుంచి భూములు తీసుకుని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర రాజధానిలో పర్యటన చేస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మోసం చేసినందుకు చంద్రబాబు తమకు  క్షమాపణ చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: