స‌మాజంలో జ‌రుగుతున్న దారుణ ఘ‌ట‌న‌ల్లో అంద‌రినీ క‌లిచివేసే అతికొద్ది సంఘ‌ట‌న‌ల్లో ఇదొక‌టి. నాగరిక స‌మాజం అంటూ మ‌న‌కు మ‌నం జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న త‌రుణంలో సంభ‌విస్తున్న ఘోరాల్లో మ‌రో దారుణం. అభివృద్ధి చెందిపోయామ‌ని...ప్ర‌పంచంలోనే అంద‌రికంటే తామే ముందంజ‌లో ఉన్నామ‌ని ప్ర‌క‌టించుకునే అగ్ర‌రాజ్య పెద్ద‌ల ఇలాకాలో జ‌రిగిన ఘోర‌మిది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న హైద‌రాబాద్‌కు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్‌ను ఓ ఆగంత‌కుడు అత్యాచారం చేసి.. ఆ త‌ర్వాత‌ హ‌త్య చేసిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. అయితే, పోలీసుల విచార‌ణ‌లో మ‌రిన్ని సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

 

న‌వంబ‌ర్ 23వ తేదీన జ‌రిగిన ఈ దారుణ హ‌త్య అనంత‌రం రూత్ జార్జ్ మృత‌దేహాన్ని యూనివ‌ర్సిటీలో ఉన్న గ్యారేజీలో గుర్తించారు. త‌న కారులోనే యువ‌తి శ‌వ‌మై క‌నిపించింది. ఈ హ‌త్య కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. నిందితుడిపై ఫ‌స్ట్ డిగ్రీ మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేయ‌డంతో పాటుగా లైంగిక‌దాడి కింద కూడా కేసును బుక్ చేసి విచార‌ణ చేయ‌గా విస్మ‌య‌క‌ర నిజాలు తెలిశాయి. తను పిలిచినా (విజిల్‌ వేసినా) పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే నిందితుడు డొనాల్డ్‌ తర్మన్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు వెల్లడించారు.

 

ప్రాసిక్యూటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున క్యాంపస్‌ నుంచి పార్కింగ్‌ గ్యారేజికి వెళ్తున్నప్పుడు తాను పిలిచినా ఆమె స్పందించకపోవడం తర్మన్‌కు ఆగ్రహం కలిగించింది. దీంతో అతడు జార్జిని అనుసరించాడు.. ఆమె అందంగా ఉందని భావించి ఆమెతో మాట్లాడాలనుకొన్నాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన తర్మన్‌ వెనుకనుంచి ఆమె మెడను పట్టుకుని, స్పృహ కోల్పోయేవరకు ఊపిరి సలుపకుండా చేశాడు. అనంతరం ఆమెను కారు వెనుక సీటులోకి లాక్కెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారిద్దరికీ అంతకుముందు ఎలాంటి పరిచయం లేదని ప్రాసిక్యూటర్‌ చెప్పారు. జార్జిని తర్మన్‌ అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని తెలిపారు. నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ హత్య, లైంగికదాడి అభియోగాలు నమోదుచేసినట్లు చెప్పారు. నేరం నిరూపితమైతే, నిందితుడికి జీవితఖైదు పడే అవకాశం ఉంది.

 

కాగా, హ‌త్య‌కు గురైన జార్జి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నేరస్థుడిపై తమకెలాంటి ద్వేషం లేదని తెలిపారు. మరే బాలికపైనా ఇలాంటి దారుణం జరుగకూడదని, ఇంకే తల్లికి ఇలాంటి శోకం మిగలకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. జార్జి కుటుంబం 30 ఏళ్ల‌ కిందట అమెరికాకు వలసవెళ్లింది.  రూత్ జార్జ్ యూఐసీలో హాన‌ర్స్ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌ది.కాగా, చికాగోలో ఉన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్ చాలా పెద్ద‌ది. దాంట్లో సుమారు 33వేల మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. టీనేజ్ యువ‌తి రూత్ జార్జ్‌ మృతి ప‌ట్ల యూనివ‌ర్సిటీ ప్ర‌క‌ట‌న చేసింది. మృతురాలి కుటుంబ‌స‌భ్యుల‌కు తీవ్ర సంతాపం తెలుపుతున్న‌ట్లు వ‌ర్సిటీ ఛాన్స‌ల‌ర్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: