ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ జనవరి 10 లేదా 11న వెలువరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపోతే బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం గురించి మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ తెలియజేశారు. ఇక అమ్మఒడి పథకాన్ని జనవరి 9న ప్రారంభించనున్నామని, జనవరి 10న లేదా ఆ తర్వాత రోజు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిద్దామని  సీఎం అన్నారని తెలిసింది.

 

 

ఇప్పటికే స్థానిక సంస్థలకు కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో హైకోర్టు కూడా తీవ్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే వైఎస్సార్‌ నవశకం ద్వారా పథకాల లబ్ధిదారుల జాబితా డిసెంబరులో ఓ కొలిక్కి వస్తుందని, ఇవి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి విశ్వాసాన్ని పొందాలని సీఎం సూచించారు.

 

 

ఇదే కాకుండా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు డిసెంబరు 20లోగా మార్కెట్‌, దేవాలయాల కమిటీల నియామకాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా నియామకాలు సమాంతరంగా మొదలు పెట్టాలని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఇకపోతే గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

 

 

అయితే  స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 59.85 శాతం కోటాను అమలు చేయగా.. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85 శాతంకు పరిమితం కావాల్సి వచ్చింది. దీని విషయంలో మరో సారి ఆలోచించాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: